ఆందోళనకు సై అంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు

దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఒక వంక వారి డిమాండ్లను దశలవారీగా పరిష్కరిస్తామని చెబుతూ, ఆందోళనను నివారించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నా, తమకు ఇస్తున్న హామీలను లిఖితపూర్వకంగా సమర్పించాలని వారు స్పష్టం చేస్తున్నారు.
 
ఈ విషయమై మంగళవారం సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో జరిగిన చర్చలు చెప్పుకోదగిన ఫలితం ఇవ్వలేకపోయాయి. ఈ నెలాఖరులోగా రూ 3,000 కోట్ల మేరకు బకాయిలను చెల్లిస్తామని, మిగిలిన మొత్తాలను మరో రెండు వాయిదాలలో చెల్లిస్తామని ఈ భేటీలో హామీ ఇచ్చారు.
 
నిన్నటి చర్చల సారాంశాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డిని కోరామని, సాయంత్రంలోపు చర్చల మినిట్స్ ఇస్తామని సీఎస్ స్పష్టం చేశారని జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. నేటి సాయంత్రంలోగా మినిట్స్ ఇస్ రేపు ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్యమ కార్యాచరణ యధావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.
 
‘‘ఆయుధం మా చేతుల్లోనే ఉంది. మేం ప్రభుత్వం ట్రాపులో పడడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలతో మాకు సంబంధం లేదు. మా అజెండా నుంచి పక్కకు వెళ్లం’’ అని తేల్చి చెప్పారు. పీఆర్సీ బకాయిలు, డీఏలపై ఈ నెల 16న చర్చిస్తామని ప్రభుత్వం చెప్పిందని బొప్పరాజు పేర్కొన్నారు. వాస్తవానికి వారికి అన్ని ప్రయోజనాల కింద రూ.21,000కోట్లకు పైగా ప్రభుత్వం బకాయి పడగా, కేవలం రూ. 3,000 కోట్లు ఇస్తాములే అనడం, అందుకు కూడా నిర్దిష్టంగా హామీ ఇవ్వక పోవడంతోఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలలో డీఏలే రూ 15,000 కోట్ల వరకు ఉన్నాయి.

కరోనా ఫలితంగా ఆర్ధిక సమస్యల కారణంగా జీతాలు సక్రమంగా చెల్లించలేక పోతున్నామని ప్రభుత్వం చెబుతున్న వాదనలను కొట్టిపారవేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారని, మరి ఉద్యోగులకు 1వ తేదీనే ఎందుకు జీతాలు వేయడం లేదు? అని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయానికే పెన్షన్ ఇస్తున్నారని, ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయమంటే మాత్రం మాట్లాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.