పిజి మెడికో ప్రీతి ఎంజీఎం ఆసుపత్రిలోనే ప్రతి చనిపోయిందని, నిందితుడు సైకోను కాపాడేందుకు మృతదేహాన్ని ఎత్తుకుపోయి నిమ్స్ లో చికిత్స చేస్తున్నట్లుగా డ్రామా చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మృతదేహం థంబ్ ద్వారా ప్రీతి మొబైల్ లాక్ ను ఓపెన్ చేసి ఆధారాలను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు.
జనగాం జిల్లాలోని గిర్ని తండాలో ప్రీతి కుటుంబాన్ని సంజయ్ పరామర్శించి ప్రీతి మరణానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రీతి ఆత్మహత్య చేసుకునే పరికితనం ఉన్న అమ్మాయి కాదని స్పష్టం చేశారు. నిర్మొహమాటంగా చెప్పే అలవాటుందని ఆమె ఫ్రెండ్స్ చెప్పారని గుర్తు చేశారు.
‘‘కేసీఆర్… మీరు తప్పు చేయకపోతే మెడికో విద్యార్ధి ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారు? ఈ విషయంలో మీకున్న అభ్యంతరమేంది? తప్పు చేసిన వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారు? ప్రీతి తరపున పోరాడే విద్యార్థులను ఎందుకు బెదిరిస్తున్నారు?’’అంటూ ప్రశ్నించారు.
ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని, ఆధారాలన్నీ చెరిపేశారని పేర్కొంటూ లాక్ ఉన్న మొబైల్ ను ఎట్లా ఓపెన్ చేస్తారు? అని నిలదీశారు. నిందితుడికి అనుకూలంగా వ్యవహరించారని అంటూ నిందితుడి వల్ల మత కల్లోలాలు వస్తాయనే భయపడ్డట్లున్నరని ధ్వజమెత్తారు. ప్రీతిది హత్యే… ఆత్మహత్య కాదని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని చెబుతూ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఫిర్యాదు చేసిన వెంటనే విచారణ జరిపితే ప్రీతి చనిపోయేది కాదని అంటూ నిందితుడి సైఫ్ పక్షాన బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుండటం సిగ్గు చేటని విమర్శించారు. కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని అని ఆరోపించారు. తొందరగా డెడ్ బాడీని ఖననం చేసి చేతులు దులుపుకోవాలని చూశారని మండిపడ్డారు. .
ప్రీతి మృతి కేసుపై మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. హోంమంత్రి పాతబస్తీకే హోంమంత్రి అని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలకు నిరసనగా సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిరసన దీక్ష చేస్తున్నామని ప్రకటించారు.

More Stories
42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి
మహిళా చైతన్యంతోనే సమాజ పటిష్టత
పైరసీ వెబ్ సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్