నాగాలాండ్‌కు తొలి సారి ఓ మహిళా ఎమ్మెల్యే

నాగాలాండ్‌కు తొలి సారి ఓ మహిళా ఎమ్మెల్యే
నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓ మహిళ అభ్యర్ధి గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పారు. బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)  అభ్యర్ధి హెకానీ జఖాలు విజయం సాధించారు. గత 60 ఏళ్లలో నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్ధి గెలవడం తొలిసారి కావడం విశేషం.
 
దిమాపూర్‌ -3 నియోజకవర్గం నుంచి హెకానీ జఖాలు 1536 ఓట్లతో గెలుపొందారు. నాగాలాండ్‌ అసెంబ్లీలో ఆరు దశాబ్దాల తరువాత ఓ మహిళ ఎమ్మెల్యే అడుగుపెట్టబోతున్నారు. లోక్ జనశక్తి పార్టీకి చెందిన అజెటో జిమోమిని ఆమె ఓడించింది. 48 ఏళ్ల హెకానీ జఖాలు న్యాయవాదితోపాటు సామాజిక కార్యకర్త కూడా.
 
మేఘాలయా అసెంబ్లీ స్పీకర్‌ మెట్బా లింగ్డో కూడా ఘనవిజయం సాధించారు. యూడీపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన మెట్బా లింగ్డో 155 ఓట్లతో గెలుపొందారు. అధికారంలో ఉన్న బిజెపి, ఎన్డీపీపీ కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఈ కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది.ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఈ కూటమి 25 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఎన్‌పీఎఫ్ 3  స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా ఎన్‌సీపీ 4, ఇతరులు 10 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. మొత్తం 183 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.
 
గురువారం కౌంటింగ్‌ నిర్వహించారు. పశ్చిమ అంగామి స్థానంలో పోటీ చేసిన ఎన్డీపీపీకి చెందిన మరో మహిళా అభ్యర్థి సల్హౌటుయోనువో క్రూసే కూడా ముందంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి నేపియూ రియో నేతృత్వంలోని నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి 30 సీట్లు గెలుచుకోగా, ఎన్‌పీఎఫ్‌ 26 స్థానాలకు పరిమితమైంది.