40 దేశాలపై చైనా గూఢచారి బెలూన్‌లను ఎగురవేసింది!

40 దేశాలపై చైనా గూఢచారి బెలూన్‌లను ఎగురవేసింది!

అమెరికా-చైనా దేశాల మధ్య స్పై బెలూన్‌ వివాదం నెలకొంది. ఇటీవలే అమెరికా గగనతలంలో చైనాకు చెందిన ఓ నిఘా బెలూన్‌ కనిపించిన విషయం తెలిసిందే. గత శుక్రవారం అట్లాంటిక్‌ సముద్రంలో ఆ బెలూన్‌ను అమెరికా పేల్చేసింది. బెలూన్‌ సాయంతో పలు దేశాలపై చైనా గూఢచర్యం చేసినట్లు అమెరికా ఆరోపిస్తోంది.

ఐదు ఖండాల్లో దాదాపు 40 దేశాల సైనిక స్థావ‌రాల‌పై చైనా నిఘా పెట్టిన‌ట్లు అమెరికన్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ‘ఐదు ఖండాల్లోని సుమారు 40 దేశాలపై నిఘా పెట్టేందుకు చైనా సైన్యం తలపెట్టిన బెలూన్‌ ప్రాజెక్టును అడ్డుకుని, కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆయా దేశాలతో బైడెన్‌ ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించింది’ అని అమెరికన్‌ అధికారి ఒకరు వెల్లడించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది.

`ఈ బెలూన్‌లను చైనా కచ్చితంగా నిఘా కోసమే ఉపయోగించిందని ఇప్పటికే రుజువైంది. బెలూన్‌ను రూపొందించిన సంస్థతో చైనా సైన్యానికి పూర్తి సంబంధాలున్నాయి. అమెరికాతోపాటు, ఇతర దేశాలపై ఎగిరిన తమ బెలూన్‌ల వీడియోలను ఆ సంస్థ తమ సైట్‌లో పెట్టుకుంది’ అని కూడా ఆ అధికారి స్పష్టం చేశారు.

అమెరికా మాత్రమే కాకుండా ఐదు ఖండాల్లోని దేశాల సార్వభౌమాధికారాన్ని చైనా ఉల్లంఘించిందని అమెరికా యుద్ధ విమానాలు చైనా నిఘా బెలూన్‌ను కూల్చివేసిన కొద్ది రోజుల తర్వాత విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ స్పష్టం చేశారు. ఈ వారం ప్రారంభంలో, విదేశాంగ డిప్యూటీ సెక్రటరీ వెండి షెర్మాన్ చైనా నిఘా బెలూన్‌పై భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియాతో సహా 40 స్నేహపూర్వక దేశాల దౌత్యవేత్తలకు సమాచారం అందించారు.

వాషింగ్టన్ నుండి వచ్చిన ప్రకటనలపై స్పందిస్తూ, చైనా గురువారం తన వైఖరిని పునరావృతం చేసింది.  పెద్ద మానవరహిత బెలూన్ ఒక పౌర వాతావరణ వైమానిక నౌక అని, అది ప్రమాదవశాత్తూ ఎగిరిపోయిందని, దానిని కాల్చడం ద్వారా అమెరికా “అతిగా స్పందించింది” అని ధ్వజమెత్తింది.

బీజింగ్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మీడియా ప్రశ్నలకు  స్పందిస్తూ, చైనా “బెలూన్ల సముదాయాన్ని” కలిగి ఉన్నట్లు తాను వినలేదని పేర్కొన్నారు. “బెలూన్ల సముదాయం” గురించి నాకు తెలియదు,” అని మావో చెప్పారు.

కాగా, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ మాట్లాడుతూ, అమెరికాపై ఉన్న చైనీస్ బెలూన్ చైనీస్ ప్రవర్తన నమూనాను నిర్ధారిస్తుందని విమర్శించారు.  గత కొన్ని సంవత్సరాలుగా బీజింగ్ వివిధ రకాల నిఘా, ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా కొత్త సైనిక సామర్థ్యాలలో భారీగా పెట్టుబడి పెడుతున్నాడని వెల్లడించారు.

“మేము ఐరోపాలో పెరిగిన చైనీస్ నిఘా కార్యకలాపాలను కూడా చూశాము – మళ్ళీ, వివిధ ప్లాట్‌ఫారమ్‌లు. వారు ఉపగ్రహాలు, సైబర్, అమెరికాలో   చూసినట్లుగా బెలూన్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి, మనం అప్రమత్తంగా ఉండాలి” అని హెచ్చరించారు.

భద్రత ప్రాంతీయమైనది కాదు, ప్రపంచవ్యాప్తం అని పేర్కొంటూ ఆసియాలో ఏం జరుగుతుందో ఐరోపాకు, యూరప్‌లో ఏమి జరుగుతుందో ఆసియా, ఉత్తర అమెరికాకు కూడా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కాగా, గత మంగళవారం, పెంటగాన్ అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, అతని బీజింగ్ కౌంటర్ జనరల్ వీ ఫెంఘే మధ్య టెలిఫోనిక్ కాల్ కోసం వాషింగ్టన్ చేసిన అభ్యర్థనను చైనా తిరస్కరించిందని తెలిపింది.