
ఇప్పటివరకు పెట్రోల్‌లో 10% ఇథనాల్ కలిపి విక్రయిస్తున్నారు. ఏప్రిల్‌లో జరిగే ఇండియా ఎనర్జీ వీక్-2023 సందర్భంగా 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే రెండు నెలల ముందే ప్రధాని ప్రారంభించడం గమనార్హం. కాగా, 2025 నాటికి పెట్రోల్‌లో10% ఇథనాల్ ఈ పరిమాణాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మొదటి దశలో 15 నగరాల్లో ఎంపిక చేసిన బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను విక్రయించనున్నారు. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా పరోక్షంగా రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఫారెక్స్ అవుట్‌గోలో భారత్‌కు రూ.53,894 కోట్లు ఆదా కానుంది.
ఇ -20 పెట్రోల్ 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని మూడు ఇంధన రిటైలర్స్‌కు చెందిన 84 పెట్రోల్ బంకుల్లో అందుబాటులోకి రానుంది. చెరకుతో పాటు విరిగిన బియ్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఇథనాల్ తయారు చేస్తున్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా భారత్ ఉంది. ఇకపై చమురు దిగుమతిని తగ్గించుకోవడంలో ఈ చర్యలు భారత్ కు ఉపయోగపడనున్నాయి. భారత్ ప్రస్తుతం చమురు అవసరాల కోసం 85% దిగుమతులపై ఆధారపడి ఉంది.
ఇథనాల్ లేని పెట్రోల్‌లతో పోలిస్తే ఇ -20ని ఉపయోగించడం వల్ల ద్విచక్ర వాహనాల్లో సుమారు 50 శాతం, ఫోర్ వీలర్స్‌ల్లో దాదాపు 30 శాతం కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక, హైడ్రోకార్బన్ ఉద్గారాలు ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ కార్లలో 20 శాతం తగ్గుతాయని అంచనా.
2022 నవంబర్ 30తో ముగిసిన సప్లై సంవత్సరంలో 440 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలిపారు. వచ్చే ఏడాది నాటికి 540 కోట్ల లీటర్ల సేకరణను పెద్ద మొత్తంలో బ్లెండింగ్ ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్రోల్‌లో ఇథనాల్ కల్పడం ద్వారా చెరకు రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.
గత ఎనిమిదేళ్లలో ఇథనాల్ సరఫరాదారులు రూ.81,796 కోట్లు ఆర్జించగా, రైతులకు రూ. 49,078 కోట్లు చెల్లించారు. రూ.53,894 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని భారత్ ఆదా చేసింది. అంతేకాకుండా 318 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ (సిఓ2) ఉద్గారాలను తగ్గించడానికి ఈ చర్య దారితీసింది.
More Stories
పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా
నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త శ్లాబులు
ఎల్టీటీఈ పునరుద్ధరణకు శ్రీలంక మహిళ ప్రయత్నం