అవినీతి ఆరోపణలతో పంజాబ్ లో మరో మంత్రి రాజీనామా

అవినీతి ఆరోపణలతో పంజాబ్ లో మరో మంత్రి రాజీనామా
అవినీతి వ్యతిరేక ఉద్యమంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆప్ ప్రభుత్వం పంజాబ్ లో అవినీతి మరకలను ఎదుర్కొంటున్నది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన  తొమ్మిదినెలల్లోనే మరో మంత్రి అవినీతి ఆరోపణలపై తాజాగా రాజీనామా చేశారు. 
పంజాబ్‌కు చెందిన ఫౌజీ సింగ్‌ సరారీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తన రాజీనామా లేఖలో సరారీ పేర్కొన్నారు. భగవంత్‌ సింగ్‌ మంత్రిమండలిలో సరారీ ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు.

సీఎం భగవంత్‌ సింగ్‌ జర్మనీ పర్యటనలో ఉన్న సమయంలో సరారీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సరారీ తన పీఏతో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారడంతో ఆయనను మంత్రమండలి నుంచి తప్పించాలనే డిమాండ్‌ ఊపందుకున్నది. ఫౌజా సింగ్‌ సరారీ పంజాబ్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. తొలిసారి ఆప్‌ తరఫున పోటీ చేసి ఫిరోజ్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇప్పటికే ఆరోగ్య మంత్రిగా పనిచేసిన డాక్టర్‌ విజయ్‌ సింగ్లాను మంత్రిమండలి నుంచి తొలగించారు. డిపార్ట్‌మెంట్‌ టెండర్లలో కమీషన్లు తీసుకున్నారని డాక్టర్‌ సింగ్లాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అవినీతి ఆరోపణలపై ఫౌజా సింగ్‌ సరారీ కూడా మంత్రి పదవికి రాజీనామా చేశారు.