
ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఆప్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో కొట్లాట జరగడంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగకుండానే సమావేశం ముగిసింది. శుక్రవారం ఉదయం మేయర్ ఎన్నిక కోసం సమావేశమైన ఢిల్లీ మున్పిపల్ కార్పొరేషన్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది.
ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన సభ్యుడిని కాకుండా వేరొక సభ్యుడిని ప్రిసైడింగ్ స్పీకర్‌గా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నియమించడంపై ఆప్ కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రొటెం స్పీకర్ సత్య శర్మను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభ్యులెవరీనీ ప్రమాణస్వీకారం చేయనీయలేదు. ఈ క్రమంలో బీజేపీ, ఆప్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొందరు సభ్యులు మైకులు, కుర్చీలను విరగొట్టారు.
ఈ ఘటనలో కొందరు సభ్యులకు గాయాలయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ ఎన్నిక నిర్వహించకుండానే సభ వాయిదా పడింది. డిసెంబరులో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. మొత్తం 250 స్థానాలకు గాను.. 134 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ 104 స్థానాలకే పరిమితమయింది. కాంగ్రెస్ కేవలం 9 సీట్లతో సరిపెట్టుకుంది.
ఎక్కువ సీట్లలో గెలిచినందున మేయర్ పీఠం తమకే వస్తుందని ఆప్ ధీమాగా ఉంది. తమ పార్టీ తరపున షెల్లీ ఒబెరాయ్‌ని మేయర్ అభ్యర్థిగా నిలబెట్టింది. తమకు తగినంత బలం లేనప్పటికీ, బీజేపీ కూడా మేయర్ ఎన్నికల్లో పోటీకి దిగింది. బీజేపీ తరపున రేఖా గుప్తా పోటీలో ఉన్నారు.
మేయర్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యుడైన ముకేశ్ గోయెల్‌ను ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఐతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా మాత్రం ముకేశ్ గోయెల్ని కాకుండా సత్య శర్మను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు.
సత్య శర్మ నామినేటెడ్ సభ్యుల చేత ముందుగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రయత్నించారు. నామినేటెడ్ మెంబర్ మనోజ్ కుమార్‌ను ప్రమాణ స్వీకారానికి సత్య శర్మ ఆహ్వానించడంతో ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు సభ మధ్యలోకి వెళ్లి నినాదాలు చేశారు. ఎన్నికైన కౌన్సిలర్లు ముందుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని చెప్పారు.
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా 10 మంది నామినేటెడ్ సభ్యులను లెఫ్టినెంట్ గవర్నర్ నియమించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో ఆప్, బీజేపీ కౌన్సిలర్లు ఒకరినొకరు తోసుకుంటూ, బిగ్గరగా అరుస్తూ, నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. ఆప్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు.
ఆప్ నేతల ప్రవర్తన అత్యంత సిగ్గు చేటు అని బీజేపీ ఆరోపించింది. వారి సిగ్గు చేటు ప్రవర్తనతో అత్యంత దారుణమైన అరాచకం పరాకాష్టకు చేరుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీజేపీ నేత బైజయంత్ జయ్ పాండా మాట్లాడుతూ, ఢిల్లీ నగర పాలక సంస్థలో కౌన్సిలర్ల సభలో ఆప్ నేతల సిగ్గు చేటు ప్రవర్తనలో వారి అరాచకం పరాకాష్టకు చేరిందని ధ్వజమెత్తారు. ఆప్ కౌన్సిలర్లు రాజ్యాంగాన్ని కొంచెం అయినా గౌరవించలేదని మండిపడ్డాయిరు. లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకుండా భౌతిక దాడులకు తెగబడటం ఎంత మాత్రం ఆమోదించదగినది కాదని స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఇచ్చిన ట్వీట్లో, ఆప్ ధరించిన అప్రజాస్వామిక ముసుగు నేడు తొలగిపోయిందన్నారు. దేశానికి ఆ పార్టీ నిజ స్వరూపం వెల్లడైందని చెప్పారు. ఢిల్లీ నగర పాలక సంస్థకు మేయర్ నియామకం జరగనేలేదని, అయినప్పటికీ, ఆప్ గూండాల గూండాయిజం ప్రారంభమైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో అధికారులను కొడుతుంటారని, ఆయన ఎమ్మెల్యేలు పెద్దలను కొడుతూ ఉంటారని, ఇది సిగ్గు చేటు అని మండిపడ్డారు.
ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, సభను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నించానని చెప్పారు. ప్రశాంతంగా కూర్చోవాలని తాను సభ్యులను కోరానని, కానీ రసాభాస చేయాలని వారు కోరుకున్నారని ఆరోపించారు. సభ సాధారణ స్థితికి చేరుకుంటే, అందరు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఐతే ఎన్నికల్లో పోటీ చేయడం తప్పేమీ కాదని, ఆప్, కాంగ్రెస్ సభ్యులు కూడా తమకే మద్దతు తెలపవచ్చని బీజేపీ చెబుతోంది. అటు కాంగ్రెస్ మాత్రం తాము ఎవరికీ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. తదుపరి మేయర్ ఎన్నిక తేదీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ త్వరలోనే ప్రకటించనున్నారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!