కాపు రేజర్వేషన్లకై హరిరామజోగయ్య నిరాహార దీక్ష!

కాపు రేజర్వేషన్లకై హరిరామజోగయ్య నిరాహార దీక్ష!

మరోసారి కాపు రిజర్వేషన్ల అంశం ఏపీ రాజకీయాలను కుదిపి వస్తుంది. ఈ విషయమై మాజీ మంత్రి చేగొండి హరిరామయ్య జోగయ్య సోమవారం నుండి ఆమరణ నిరాహారదీక్షను  ప్రకటించారు. కాపు రిజర్వేషన్ల సాధనకై చావడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. సోమవారం పాలకొల్లులోని గాంధీ సెంటర్‌లో నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.

ఇంతకు ముందే ఈ విషయమై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అల్టిమేటం ఇచ్చిన్నప్పటికీ అటువైపు నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయన నిరాహారదీక్షకు సిద్ధమవుతున్నారు.  దీక్షకు అనుమతి కోరినా పోలీసులు ఇవ్వలేదని, దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించినా దీక్షను కొనసాగిస్తానని హరిరామజోగయ్య స్పష్టం చేశారు.

కాపులపై సీఎం జగన్‌కు ఏమాత్రం ప్రేమ లేదని, కాపులు ఆర్థికంగా ఎదగడం ఆయనకు ఇష్టం లేదని ఆయన విమర్శించారు. కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించగా అందులో 5 శాతం కాపులకు ఇవ్వడానికి చంద్రబాబు హయాంలో ప్రయత్నించారని గుర్తుచేశారు.  బిల్లు గవర్నర్‌ ఆమోదం పొందే సమయానికి జగన్‌ అధికారంలోకి రావడంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు దక్కలేదని విమర్శించారు. మూడేళ్లలో జగన్‌ కాపులకు అన్యాయం చేశారని హరిరామజోగయ్య దుయ్యబట్టారు.

కాగా, ఇప్పటి వరకు ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం అంటూ జగన్ మోహన్ రెడ్డి కాలయాపన చేస్తూ వస్తున్నారు. అయితే పార్లమెంట్ సాక్షిగా కేంద్రంకు ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదని, రాష్ట్ర  ప్రభుత్వ పరిధిలోని అంశమని, రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో జగన్ ప్రభుత్వం ఈ విషయమై వత్తిడి ఎదుర్కొంటున్నది.

మరో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సహితం కాపు రేజర్వేషన్లను అమలు పరచమని కోరుతూ గత వారం ముఖ్యమంత్రికి లేఖ వ్రాసారు. దాదాపు పది రోజుల వ్యవధిలో ఆయన రెండు లేఖలు వ్రాసారు. అయితే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయడం లేదు.