బీజేపీ తొలితరం నేత పివి చలపతిరావు మృతి 

భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీలలో తొలితరం నేతలలో తెలుగు రాష్ట్రాలలో దాదాపు చివరి వారిన మాజీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు, నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు (88) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి పీవీ చలపతిరావు పార్థీవ దేహాన్ని ఇంటికి తరలించారు.

సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చలపతిరావుకు భార్య అనురాధ (రిటైర్డ్‌ లైబ్రేరియన్‌), కుమార్తెలు అంజనా ఉపాధ్యాయ, అపర్ణా ముఖర్జీ, కుమారుడు ఎమ్మెల్సీ పివిఎన్‌ మాధవ్‌ ఉన్నారు. చలపతిరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా రెండు పర్యాయాలు పనిచేశారు. జనసంఫ్‌లో ఉండగా 1974లోనూ, బిజెపిలో ఉండగా 1984లోనూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 

విశాఖపట్నంలో కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలలో కార్మిక సంఘం నాయకుడిగా, తదుపరి విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా చలపతిరావు విశేష ప్రాచుర్యం పొందారు. ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిసమయం పార్టీ కార్యక్రమాలకు వినియోగించారు.  ఎమర్జెన్సీ సమయంలో పోలీసులకు చిక్కకుండా రహస్య జీవనం గడుపుతూ, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర వహించారు.

ఉమ్మడి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటనలు జరుపుతూ, పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తి కలిగిస్తూ ఉండేవారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.  ఆయన భార్య రాధా చలపతి కూడా సామాజిక సేవా కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొనేవారు. ఆమె మంచి రచయిత్రి కూడా.

ఆయన కుమారుడు పివిఎన్ మాధవ్ ప్రస్తుతం గ్రాడుయేట్ల నియోజకవర్గం నుండి ఎమ్యెల్సీగా ఉన్నారు. శాసనమండలిలో బిజెపి పక్ష నాయకుడిగా, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.  చలపతిరావు మరణం పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన చలపతిరావు తనకు మార్గదర్శకులని ఆయన పేర్కొన్నారు.