అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మోదీ తల్లి

అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మోదీ తల్లి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఆస్వస్థత కారణంగా అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో బుధవారంనాడు చేరారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
తల్లి హీరాబెన్‌ను కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం  అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రికి చేరుకున్నారు. ఇటీవలే 100వ పడిలోకి అడుగుపెట్టిన హీరాబెన్ ఆసుపత్రిలో చేరగానే బీజేపీ గుజరాత్ ఎమ్మెల్యేలు దర్శబెన్ వాఘేలా, కౌషిక్ జైన్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచు తన తల్లితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఉంటారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఆయన హీరాబెన్‌ను నేరుగా కలుసుకుని ఆమె ఆశీస్సులు అందుకున్నారు. తల్లితో కలిసి టీ తాగుతూ ఉభయులు మాట్లాడుకుంటున్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాయి.
 గత జూన్‌లో హీరాబెన్ 99వ పుట్టినరోజుకు కూడా మోదీ హాజరయ్యారు. నూరవ వసంతంలోకి అడుగుపెడుతున్న తన తల్లి గురించి ‘మదర్’ అనే టైటిల్‌తో మోదీ ఒక ఎమోషనల్ బ్లాగ్ కూడా రాశారు.
ప్రధాన మంత్రి సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు కర్ణాటకలోని మైసూరులో మంగళవారంనాడు కారు ప్రమాదంలో గాయపడిన కొద్ది గంటలకే హీరాబెన్ ఆసుపత్రిలో చేరడం వారి ఆత్మీయులను ఆందోళనకు గురిచేసింది.
కాగా,  ఇటువంటి సమయంలో ప్రధాని మోదీకి తాను బాసటగా పిలుస్తున్నట్లు చెబుతూ తల్లీ కొడుకుల మధ్య ప్రేమ వెలకట్టలేనిదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ కష్ట సమయంలో మోదీ వెంటే తానుంటానని పేర్కొన్నారు. మోదీ తల్లి త్వరగా కోలుకోవాలంటూ రాహుల్ ఆకాంక్షించారు. ప్రధాని మోదీ తల్లి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.