లోకాయుక్త బిల్లు ఆమోదించిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ

లోకాయుక్త బిల్లు..2022ని మ‌హారాష్ట్ర అసెంబ్లీ బుధ‌వారం ఆమోదించింది. దానోతి భారతదేశంలో మొదటి సారిగా ఈ లోకాయుక్త బిల్లును తీసుకొచ్చి, ఆమోదించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏదైనా విచారణ ప్రారంభించే ముందు అసెంబ్లీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుంది.
 
సభ సమావేశాల ముందు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అలాంటి తీర్మానాన్ని మహారాష్ట్ర శాసనసభలోని మొత్తం సభ్యులలో మూడింట రెండొంతుల మంది కంటే తక్కువ కాకుండా ఆమోదించాలని ముసాయిదా బిల్లు పేర్కొంది. ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలపై వచ్చిన అంశం రాష్ట్రంలో అంతర్గత భద్రత లేదా పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించినది అయితే దానిపై లోకాయుక్త విచారణ చేయరాదని కూడా పేర్కొంది.
 
లోకాయుక్తలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఛైర్ పర్సన్ గా ఉంటారు. సీఎం, డిప్యూటీ సీఎం, శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు సభ్యులుగా ఉంటారు. ఈ బిల్లు వల్ల ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా లోకాయుక్త పరిధిలోకి వస్తారని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. బిల్లు తీసుకురావడానికి ముందు సామాజిక కార్యకర్త అన్నా హజారేతో చర్చించామని ఆయన చెప్పారు.
 
“బిల్లును ఆమోదించిన తర్వాత సలహాలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తాము. ఈ లోకాయుక్త చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా మేం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులపై లోకాయుక్తకు ఫిర్యాదు చేసే వ్యక్తి బిల్లును దుర్వినియోగం చేయకూడదు. ఒక వేళ వెరిఫికేషన్ లో ఆ వ్యక్తి తప్పుగా కేసు పెట్టినట్టు తెలిస్తే, అతడిపై చర్య తీసుకునే నిబంధన చట్టంలో పొందుపర్చాం” అని వివరించారు. 
 
“మేము పారదర్శకతను తీసుకురావాలని, అవినీతిని అంతం చేయాలనుకుంటున్నాం” అని ఫడ్నవీస్ తెలిపారు. ఈ లోకాయుక్తలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఫిర్యాదు అందిన నాటి నుంచి ఏడాదిలోపు విచారణ పూర్తవుతుంది. ఈ బిల్లును మంత్రి దీపక్ కేసర్కర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. అయితే ఉపాధ్యాయుల ప్రవేశ పరీక్షలో అవకతవకలపై ప్రతిపక్షాలు వాకౌట్ చేయడంతో చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది.