వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తలపెట్టిన   ప్రజా ప్రస్థానం యాత్రకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చినా పోలీసులు మాత్రం పర్మిషన్ ఇవ్వట్లేదని షర్మిల  లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత పోలీసులు ఎలా నిరాకరిస్తారని ప్రశ్నించింది. అప్పుడే షరతులతో కూడిన అనుమతినిచ్చినట్టు పేర్కొన్న ధర్మాసనం  పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో న్యాయస్థానం పెట్టిన షరతులే ఇప్పుడు కూడా వర్తిస్తాయని ధర్మాసనం షర్మిలకు గుర్తు చేసింది. 
అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద కానీ, రాజకీయ, మతపరమైన అంశాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు షర్మిలకు సూచించింది. పాదయాత్ర సమయంలో ఎలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. గతంలోనూ హైకోర్టును ఆశ్రయించిన షర్మిలకు షరతులతో కూడిన అనుమతిని ధర్మాసనం ఇచ్చింది. 
 
అయితే.. మరోసారి పోలీసులకు దరఖాస్తు పెట్టుకోవాలని సూచించింది. కానీ  పోలీసులు మాత్రం ఆమె పాదయాత్రకు షోకాజు నోటీసులతో బ్రేక్ వేశారు. పోలీసులు ఇచ్చిన షోకాజు నోటీసులకు షర్మిల సమాధానం ఇవ్వక పోవటంతో  పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో మరొకసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన షర్మిలకు ముందు పెట్టిన షరతులతోనే మళ్లీ అనుమతి ఇచ్చింది న్యాయస్థానం.. షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని వరంగల్ సీపీకి  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.