బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులపై 22 వరకు స్టే

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్) బీఎల్ సంతోష్ ,  కేరళ వైద్యుడు జగ్గు స్వామికి  సిట్  ఇచ్చిన 41ఏ సీఆర్పీసీ నోటీసులపై స్టే పొడిగింపుపై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. బీఎల్ సంతోష్‌ తరపున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్​ రెడ్డి వాదనలు వినిపించారు. 
 
ఘటన జరిగిన సమయంలో కేవలం ఎ 1 నుంచి ఎ 3 నిందితులు మాత్రమే ఉన్నారని, ఆరోజున బీఎల్​ సంతోష్, జగ్గు స్వామి ఇద్దరూ ఫాం హౌస్​ లో లేరని చెప్పారు. ల్యాప్​ టాప్, మొబైల్ ఫోన్ లో ఫొటోలు , వాట్సాప్ చాట్ ఆధారం తో ఎట్ల కేసులో నిందితులుగా చేర్చుతారని ప్రశ్నించారు. 
 
నేరస్తుల జాబితాలో ఉన్న ప్రతిపాదిత నిందితులను ఎఫ్​ఐఆర్​ లో  చేర్చాలని మెమో దాఖలు చేసినా కోర్టు తిరస్కరించిదని న్యాయవాది దేశాయ్ ప్రకాశ్​ రెడ్డి  గుర్తు చేశారు.
 
‘‘41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేయడానికి మార్గదర్శకాలు ఉన్నాయి. పోలీసులు ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధంగానే నోటీసులు జారీ చేశారు. కేసుతో సంబంధం ఉన్న వాళ్లకు మాత్రమే నోటీసులు జారీ చెయ్యాలి. కేసులో ఎలాంటి పురోగతి లేకుండానే నోటీసులు జారీ చేశారు” అని ఆయన కోర్టుకు వివరించారు. 
 
సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పును ప్రకటించక ముందే బీఎల్ సంతోష్, జగ్గు స్వామిలను  నిందితులుగా చేర్చాలని ఏజీ కోరడం విడ్డూరంగా ఉందని  ప్రకాశ్​ రెడ్డి చెప్పారు. దీంతో ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమో కాపీ ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి కోరారు. 
 
దాన్ని పరిశీలించిన అనంతరం బీఎల్ సంతోష్, జగ్గు స్వామిలకు సిట్  ఇచ్చిన 41ఏ సీఆర్పీసీ నోటీసులపై స్టే గడువును ఈనెల 22 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రివిజన్ పిటిషన్ పై సింగిల్ బెంచ్ ఇంకా తీర్పు ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో స్టేను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22 కి వాయిదా వేసింది.
విచారణ పేరుతో చిత్రహింసలు 
 
మరోవంక, మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని న్యాయవాది శ్రీనివాస్ తరపు న్యాయవాది హైకోర్టును తెలిపారు.  ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రీనివాస్, రామచంద్రభారతి తరుపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా శ్రీనివాస్ సహా అతడి కుటుంబాన్ని వేధిస్తున్నారని చెప్పారు.
బండి సంజయ్, రఘునందన్రావు పేరు చెపితే 5 నిమిషాల్లో విచారణ పూర్తవుతుందని సిట్ అధికారులు బెదిరిస్తున్నారని పేర్కొంటూ రఘునందన్ రావుతో శ్రీనివాస్కు పరిచయం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు పోలీసులు ఉద్ధేశ్యపూర్వకంగా మల్టిపుల్ కేసులు నమోదు చేస్తున్నారని రామచంద్రభారతి తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయని హైకోర్టు ప్రశ్నించగా..బంజారాహిల్స్లో కేసు నమోదు చేశారని న్యాయవాది జవాబిచ్చారు.