పీఎఫ్ఐకి నిధులిస్తోన్న పార్టీ టీఆర్ఎస్

కేంద్రం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) తీవ్రవాద సంస్థకు టీఆర్ఎస్ నిధులిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డాగా మారిందని, ఎన్ఐఏ సోదాలు నిర్వహించేదాకా రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులకు సోయి లేదా? అని ప్రశ్నించారు.
 
ప్రజా సంగ్రామ పాదయాత్ర జగిత్యాలకు చేరుకున్న సందర్భంగా ప్రసంగిస్తూ  పీఎఫ్ఐ తీవ్రవాదుల జోలికి పోకుండా పోలీసులను టీఆర్ఎస్ నేతలే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జగిత్యాల నడిబొడ్డున ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిన దుర్మార్గులను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
ఇకపై అలాంటి నినాదాలు చేసే లుచ్చాలను బట్టలూడదీసి కొట్టాలని పిలుపునిచ్చారు. అయ్యప్ప, హనుమాన్, భవానీ దీక్షాపరులకు విధుల్లో వెసులుబాటు ఎందుకు ఇవ్వరని ఆయన అడిగారు. ఎములాడ, ధర్మపురి, బాసర, కొండగట్టు ఆలయాల నిధుల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 
 బతుకమ్మ పేరుతో డిస్కో డ్యాన్స్ చేయించి బతుకమ్మ తల్లిని అవమానించి పాపం చేసిన కేసీఆర్ బిడ్డకు ఉసురు తగిలి తీరుతుందని స్పష్టం చేశారు. తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపుతుందని స్పష్టం  ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే కుట్ర చేస్తున్నారని స్పష్టం చేస్తూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
రూ.లక్ష కోట్లతో దొంగ సారా, పత్తాల దందా చేస్తున్న బిడ్డ అరెస్ట్ కాకుండా కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎంతో కలిసి తెలంగాణ, సమైక్యాంధ్ర సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని సంజయ్ ధ్వజమెత్తారు.  సీఎం కేసీఆర్ ఢిల్లీలో యాగం చేసే ముందు లిక్కర్ స్కామ్ తో తన బిడ్డ కవితకు సంబంధం లేదని ప్రమాణం చేయాలని సంజయ్ సవాల్ విసిరారు.
ఏపీ, తెలంగాణ సీఎంలు కలిసి.. కాంట్రాక్టులు, కమీషన్లు దోచుకుంటూ సింటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు సీఎంలు కలిసి సమైఖ్యాంధ్ర సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వచ్చినా రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదని విమర్శించారు. ఢిల్లీలో రాజశ్యామల యాగం చేస్తానంటున్న కేసీఆర్ తాను ఇచ్చిన హామీ గురించి ముందు ప్రజలకు చెప్పాలని, అప్పుడే యాగానికి సార్థకత ఉంటుందని పేర్కొన్నారు.