అమిత్ అరోరాకు మరో వారం కస్టడీ పొడిగింపు

అమిత్ అరోరాకు మరో వారం కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన అమిత్ అరోరాకు ఉచ్చు బిగుస్తుంది. నేటితో అమిత్ అరోరా కస్టడీ ముగియగా..సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. మరో వారం రోజుల పాటు అమిత్ అరోరా కస్టడీని పొడిగించాలని అధికారులు కోరారు. అధికారుల అభ్యర్ధనను పరిగణలోకి తీసుకున్న కోర్టు మరో వారం రోజుల పాటు అమిత్ అరోరా కస్టడీని పొడిగించింది.

ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను డిసెంబర్ 5న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడిగా తెలుస్తుంది. ఇక ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. 

కాగా అమిత్ బడ్జీ ప్రైవేట్ కంపెనీ యజమానిగా ఉన్నాడు. ఇక సీబీఐ, ఈడీ ఎఫ్ఐఆర్ లో అమిత్ అరోరా 9వ నిందితునిగా ఉన్నాడు. లిక్కర్ స్కాంలో అమిత్ అరోరాను విచారించిన ఈడీ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు.

ఈ  కేసులో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుల జ్యుడిషియల్ కస్టడీని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల పొడిగించింది. వారి జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో నిన్న హాజరుపరిచారు. దీనిపై వాదనలు విన్న కోర్టు డిసెంబర్ 19 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించింది. 

ఇక బెయిల్ మంజూరు కోసం శరత్ చంద్రారెడ్డి రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై డిసెంబర్ 13న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. ఇప్పటికే అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. దీంతో కవితకు నోటీసులిచ్చిన సీబీఐ.. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని  తన నివాసంలో  విచారించనుంది.