నాగ్‭పూర్ మెట్రోకు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్న నాగపూర్ నగరంలోని నాగ్‌పూర్ మెట్రో గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం పొందింది.  ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండంతస్తుల ఫ్లై ఓవర్ గల మెట్రోగా ప్రసిద్ధి చెందింది. మెట్రో నిర్మాణాల్లో ఇంత పొడవులో రెండంతస్తుల ఫ్లైఓవర్ ఎక్కడా నిర్మించ లేదు.
దీని పొడవు 3.14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మేరకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చిన సర్టిఫికెట్‌ను మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర మెట్రో ఎండీ బ్రిజేష్ దీక్షిత్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు ఈ అవార్డ్ రావడంతో తమ బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు.
వార్దా రోడ్డులో నిర్మాణం చేపట్టడం అతి పెద్ద సవాల్‌ అని, దాన్ని తాము అధిగమించినందుకు ఆనందంగా ఉందని బ్రిజేష్ దీక్షిత్ తెలిపారు.  నాగ్‭పూర్ మెట్రో గిన్నీస్ రికార్డు సాధించడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర మెట్రోకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా భారత జాతీయ రహదారుల సంస్థకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ  3.14 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ వయడక్ట్ నిర్మాణం, అలాగే మెట్రో కింద జాతీయ రహదారి నిర్మాణం అద్భుతమని గడ్కరి కొనియాడారు.  ఇదివరలో నాగ్‌పూర్‌ మెట్రో పేరు మీద గతంలో ఇంకో రికార్డు కూడా ఉంది. డబుల్ డక్కర్ పద్ధతిలో అత్యధిక మెట్రో స్టేషన్లు కలిగి ఉండడంతో  ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‭లో చోటు దక్కించుకుంది. వార్దా రోడ్డులో నిర్మించిన డబుల్ డెక్కర్ వయడక్ట్ సుమారు 3.14 కిలోమీటర్ల మేర ఉంది.