
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులు ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దోషుల రెమిషన్ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇంప్లీడ్ చేయలేదని, దీంతో ప్రభుత్వం కేసులో భాగస్వామ్యం కాలేకపోయిందని అందులో పేర్కొంది.
శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి సున్నిత కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపింది. ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చెందిన వారని, దేశ మాజీ ప్రధానిని హత్య చేసిన కేసులో వారు దోషులుగా తేలారని గుర్తు చేసింది.
నిందితుల విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పు న్యాయాన్ని దుర్వినియోగం చేసేలా ఉందని కేంద్రం తన పిటిషన్లో పేర్కొంది. మొత్తం ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చెందినవారని పేర్కొంటూ మాజీ ప్రధానిని హత్య చేసి ఉగ్రవాదులుగా ముద్ర పడిన వారికి క్షమాభిక్ష పెట్టడం అంతర్జాతీయంగా ప్రభావం చూపిస్తుందని, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
దోషుల విడుదలపై వాదనలు వినిపించేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేస్తూ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా దోషులను విడుదల చేయడమంటే.. సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని కేంద్రం స్పష్టం చేసింది. 1991లో జరిగిన రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీం ధర్మాసనం గతవారం 11న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
దోషులు 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారని, ఈ కాలంలో వారు సత్ప్రవర్తనతో మెలిగారని తీర్పు సందర్భంగా కోర్టు పేర్కొంది. కాగా, సుప్రీం తీర్పును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. మాజీ ప్రధాని హత్యకు పాల్పడిన దోషులను విడుదల చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది, తాజాగా కేంద్రం కూడా కోర్టు తీర్పుపై స్పందించింది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు