ప్రఖ్యాత పాత్రికేయులు వరదాచారి కన్నుమూత

ప్రఖ్యాత  పాత్రికేయులు వరదాచారి కన్నుమూత
ప్రముఖ పాత్రికేయులు  గోవర్ధన సుందర వరదాచారి (92) గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు.తెలుగు పాత్రికేయ లోకానికి జీఎస్‌ వరదాచారిగా సుపరిచితుడైన ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
వరదాచారి అక్టోబర్ 15, 1932న ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జన్మించారు.  ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1954 ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ. 1956 జర్నలిజంలో పి.జి.డిప్లొమా 1959 యల్.బి. డిగ్రీలు పొందారు.
 
వర్సిటీ స్థాయి ‘ఉస్మానియా కొరియర్‌’ అభ్యాసన పత్రికకు ఎడిటర్‌గా ఎంపికయ్యారు. 1954లో జర్నలిజంలోకి అడుగుపెటి ‘హిందూ’ పత్రికలో ఇంటర్న్‌షిప్‌ చేశారు. అనంతరం అందులో ఉద్యోగ అవకాశం వచ్చినా, తెలుగు పత్రికల్లో పనిచేయాలనే ఇష్టంతో 1956లో ‘ఆంధ్రజనత’లో చేరి 1961 వరకు పనిచేశారు. ఆ తర్వాత 1982 వరకు ఆంధ్రభూమిలో, 1988 వరకు ఈనాడులో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేశారు. 
తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. జర్నలిజంలో సేవలకుగాను వరదాచారిని తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌తో సత్కరించింది. ప్రభుత్వం నుంచి ఉత్తమ పాత్రికేయుడిగా జీవనసాఫల్య పురస్కారంతో పాటు పలు అవార్డులు అందుకున్నారు.
పత్రికా విలువలపై వరదాచారి పలు పుస్తకాలు రచించారు. సినీ విమర్శకుడిగా.. ఓ మూసలో సాగుతున్న తెలుగు సినిమా సమీక్షలను కొత్త దారిలోకి మళ్లించారు. ‘ఇలాగేనా రాయడం’, ‘దిద్దుబాటు’, ‘మన పాత్రికేయ వెలుగులు’, ‘వరద స్వరాక్షరి’ వంటి యువ పాత్రికేయులకు ఉపయుక్తమయ్యేవి ఇందులో ఉన్నాయి.
 
 కేంద్ర సాహిత్య అకాడమీకి ‘ఆంధ్రజ్యోతి’ వ్యవస్థాపక ఎడిటర్‌ ‘నార్ల వెంకటేశ్వరరావు’ మోనోగ్రా్‌ఫను అందించారు. ఆత్మకథను ‘జ్ఞాపకాల వరద’ పేరిట అక్షరీకరించారు. వరదాచారికి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ‘నార్ల జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం చేసింది. 
 
 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో డిసెంబర్, 1988 నుంచి విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశారు. పత్రకార్ శిరోమణి పురస్కారాన్ని ఆయనకు నవంబర్, 1976లో ఉదంత మార్తాండ్ అనే తొలి హిందీ పత్రిక 150వ వార్షికోత్సవం సందర్భంగా కలకత్తాలో జరిగిన సర్వభాషా పత్రకార్ సమ్మేళనంలో ప్రదానం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం పత్రికా రంగంలో విశిష్ట కృషికి 1999లో ప్రతిభా పురస్కారంను అందించింది.
 
 దాసరి స్వర్ణపతకం ప్రదానం ఉత్తమ సినీ జర్నలిస్టుగా 1986లో వంశీ సంస్థ ద్వారా పొందారు.  రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ పాత్రికేయుడిగా జీవన సాఫల్య పురస్కారం పొందారు.  
 
నా మాట – వివిధ పత్రికలలో ప్రచురితమైన సంపాదకీయాలు, వ్యాసాలు, లఘు వ్యాఖ్యలు, సమీక్షల సంకలనం. దిద్దుబాటు – పత్రికా రచనలో సాధారణంగా జరిగే పొరపాట్లపై సోదాహరణంగా రాసిన విమర్శనాత్మక వ్యాసాల సంపుటం. ఇలాగేనా రాయడం? – పత్రికలలో వచ్చే సంపాదకీయాలు, తదితర వ్యాఖ్యలలో కొరవడిన పాత్రికేయ నిష్పాక్షికతను విశ్లేషించే వ్యాసాల సంకలనం ప్రచురితం అయ్యాయి.
 
తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, జర్నలిజం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యత్వం. రచన జర్నలిజం కళాశాల నిర్వహణ మండలి సభ్యత్వం నిర్వహించారు.  ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్ష పదవితో పాటు పలు పదవులు చేపట్టారు.
బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ నిర్మాణంలో ప్రత్యేక పాత్ర పోషించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 
 
 కార్యదర్శి: 1962-64 ప్రధాన కార్యదర్శి 1964-66, అధ్యక్షుడు: 1980-81 ప్రెస్ క్లబ్ స్థాపక కార్యదర్శి: 1963-64. జర్నలిస్టుల సహకార గృహ నిర్మాణ సంఘం అధ్యక్షుడు.  2001 నుంచి 2006 వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా 2022 వరకు కొనసాగారు. 
సీనియర్‌ జర్నలిస్టు కెఎల్ లక్ష్మారెడ్డి మృతి 
 
కేఎల్‌ రెడ్డిగా పాత్రికేయ లోకానికి పరిచయమున్న సీనియర్‌ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి(92) అనారోగ్యంతో బాధపడుతూ గురువారం వరంగల్‌లో తుదిశ్వాస విడిచారు. లక్ష్మారెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా పరసాయపల్లె. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1950లో డిగ్రీ అనంతరం జర్నలిజంలోకి అడుగుపెట్టారు. 
 
సూర్యదేవర రాజ్యలక్ష్మి నిర్వహణలోని ‘తెలుగు దేశం’ రాజకీయ వార పత్రికలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్రభూమి, నేటి నిజం, సాయంకాలం, మహానగర్‌ తదితర పత్రికల్లో కేఎల్‌ రెడ్డి వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో జైలు జీవితం గడిపారు. 
 
ఉద్యమ సమయంలో ‘నేడు’ పేరుతో ఈ ప్రాంత ఆకాంక్షలను వెలిబుచ్చుతూ, 3 నెలల పాటు దిన పత్రిక స్థాయిలో కరపత్రం ప్రచురించారు. అయితే, ఇందుకు వార్తా పత్రికల రిజిస్ట్రార్‌ అనుమతి లేదంటూ లక్ష్మారెడ్డికి నెల రోజుల జైలు శిక్ష విధించారు. 
ఏడేళ్ల కిందట ఆయన ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ రూ.15 లక్షలు అందజేశారు. ఆ నగదుపై వడ్డీని మాత్రమే స్వీకరిస్తూ, తన తదనంతరం ప్రభుత్వానికి తిరిగిచ్చేలా లక్ష్మారెడ్డి విల్లు వ్రాసారు.