అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్
నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేశారు. ఈ మేరకు ఎన్సీపీ ట్వీట్‌ చేసింది. 81 ఏళ్ల వయసున్న శరద్‌ పవార్‌ ఆరోగ్యం క్షీణించినట్లు తెలిపింది. మరో మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉండనున్నారు. 
 
అయితే పవార్ ఏ సమస్యతో ఆస్పత్రిలో చేరారన్నది మాత్రం వెల్లడించలేదు. శరద్ పవార్ కు ఇప్పటికే  మూడు సర్జరీలు జరిగాయి.  పార్టీ ఆఫీసు బ్యారర్లు, కార్యకర్తలు ఎవరూ ఆసుపత్రి వద్ద గుమిగూడవద్దని ఎన్‌సీపీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జె పార్టీ అధికారిక లేఖలో కోరారు.
 
షెడ్యూల్ ప్రకారం శరద్‌ పవార్‌, నవంబర్‌ 4 నుంచి 5 వరకు షిర్డీలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంది. అలాగే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’లో నవంబర్‌ 8న శరద్‌ పవార్‌ పాల్గొంటారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి.
 
కాగా, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ గత ఏడాది ఏప్రిల్‌ 11న కూడా ఆసుపత్రిలో చేరారు. ఆయన గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు గతంలో నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స షెడ్యూల్‌కు ముందు రోజున ఆయన హాస్సిటల్‌లో అడ్మిట్‌ అయ్యారు. 
 
గత ఏడాది మార్చి 30న పిత్త వాహికలోకి జారిన పిత్తాశయ రాళ్లలో ఒకదాన్ని తొలగించడానికి ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ చోలాంగియోపాంక్రియాటోగ్రఫీ (ఈఆర్‌సీపీ) ప్రక్రియను చేయించుకున్నారు.