బ్రిటన్‌ హోం మంత్రి వ్యాఖ్యలపై భారత్‌ అభ్యంతరం

బ్రిటన్‌ హోం  మంత్రి వ్యాఖ్యలపై భారత్‌ అభ్యంతరం
గత నెలలోనే బాధ్యతలు చేపట్టిన, భారత సంతతికి చెందిన బ్రిటన్‌ హోం  మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ వ్యాఖ్యలపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీసా పరిమితి దాటిన తర్వాత కూడా చాలా మంది భారతీయులు బ్రిటన్‌లోనే ఉంటున్నారని, గతేడాది ఇరుదేశాల మధ్య ప్రారంభమైన మైగ్రేషన్‌ అండ్‌ మొబిలిటీ పార్టనర్‌షిప్‌ (ఎంఎంపి) సరిగా పనిచేయడం లేదని బ్రిటన్‌ మంత్రి గురువారం వ్యాఖ్యానించారు. 
 
ఎంఎంపి కింద విస్తృత చర్చల్లో భాగంగా బ్రిటన్‌లో వీసా గడువు దాటిన భారతీయ పౌరులను తిరిగి వచ్చేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇండియన్‌ హై కమషన్‌ స్పష్టం చేసింది. ఈ ఒప్పందం కింద లేవనెత్తిన అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించామని  హై కమిషన్‌ పేర్కొంది. 
 
అలాగే బ్రిటన్‌ సహకారం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది. ఇరు దేశాల మధ్య చర్చల్లో ఉన్న ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)పై వీసా సంబంధిత రిజర్వేషన్లపై  ఉన్నాయని  పేర్కొన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై ఇండియన్‌ హైకమిషన్‌ స్పందిస్తూ మొబిలిటీ, మైగ్రేషన్‌కు సంబంధించిన విషయాలపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, ఈ సమయంలో వాటి గురించి వ్యాఖ్యలు సమంజసంగా ఉండకపోవచ్చని అంటూ విచారం వ్యక్తం చేసింది.  భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందమైనా ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనకంగా ఉంటుందని భావిస్తున్నామని వెల్లడించింది. బ్రిటన్‌ తన వాగ్దానాల అమల్లో పురోగతి సాధించాలని ఎదురుచూస్తోందని తెలిపింది.
 
గత నెలలోనే అధికారంలోకి వచ్చిన లిజ్ ట్రస్ ప్రభుత్వం దేశంలో నికర వలసదారులను తగ్గించే 2019 ఎన్నికల ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండాలని భావిస్తోంది, సుయెల్లా బ్రావెర్‌మాన్ ఒక  ఇంటర్వ్యూలో బ్రిటన్‌లో తక్కువ నైపుణ్యం కలిగిన వలసదారులు అధిక సంఖ్యలో ఉన్నారని, అంతర్జాతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని  పేర్కొన్నారు,
 
 విద్యార్థులు తమపై ఆధారపడిన వారిని బ్రిటన్ కు తరచుగా తీసుకువస్తారని, తద్వారా దేశ వృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆమె తెలిపారు. “ఆ వ్యక్తులు ఇక్కడకు వస్తున్నారు, వారు తప్పనిసరిగా పని చేయడం లేదు లేదా వారు తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో పని చేస్తున్నారు, వారు మన ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడంలో సహకరించడం లేదు” అంటూ ఆమె పేర్కొన్నారు. 
 
యుకె ప్రభుత్వం వలసలను తగ్గించడం కోసం ఇమ్మిగ్రేషన్‌ను సమీక్షిస్తుందని సుయెల్లా బ్రేవర్‌మాన్ వెల్లడించారు. ప్రభుత్వ జాతీయ గణాంకాల  ప్రకారం, జూన్ 2021తో ముగిసిన సంవత్సరంలో యుకెకు నికర వలసలు 239,000. 
 
దేశంలోని యూరోపియన్ యూనియన్ కార్మికులు బ్రెక్సిట్ తర్వాత తగ్గించినందున, ముఖ్యంగా భారతదేశం నుండి ఈయూయేతర ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అందువల్ల, యుకెలో నికర వలసల తగ్గింపు భారతీయ వలసదారులు, బ్రిటన్‌లో చదువుకోవాలనుకునే విద్యార్థులపై ప్రభావం చూపుతుంది.