
డా. వడ్డీ విజయ సారధి,
ప్రముఖ రచయిత, విశ్లేషకులు, సామాజిక కార్యకర్త
అసలు మునుగోడు ఉపఎన్నిక ఎందుకు తెచ్చిపెట్టాలి? ఒక శాసనసభ్యుడు మరణించగా ఉపఎన్నిక రావటం అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీకి (కాంగ్రెసుకు) చెందిన ఒక శాసనసభ్యుడు మరో ప్రతిపక్షంలో చేర గోరటమేమిటి? అందుకు అతడు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఉపఎన్నిక తెచ్చిపెట్టటమేమిటి?
శాసనసభ స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించటం, ఎన్నికల కమిషన్ ఉపఎన్నిక నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీచేయటమూ, ఈ లోపల వివిధ పార్టీలకు చెందిన అతిరథ, మహారథులని పేర్కొనదగిన నేతలు వచ్చి మూగటమేకాదు, మకాం పెడ్తున్నారు- ఇవేవీ మన ఊహకు అందే విషయాలు కానే కావు. ఈ ఊహాతీత పరిణామాలు చాలామందిని విస్మయపరుస్తున్నవి; చిరాకు పుట్టిస్తున్నవి.
అనవసరంగా ప్రజాధనం వృధాగా వ్యయమై పోతున్నదని కొందరు వాపోతున్నారు. ఉపఎన్నిక తెచ్చిపెట్టి, ప్రజాజీవితంలోని ప్రశాంతతను భంగపరిచారని ఆ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని, ఆయనను పార్టీలో చేర్చుకుని, మళ్లీ అభ్యర్థిగా నిలుపుతామని హామీ ఇచ్చిన భాజపాను తప్పుపడుతున్నారు.
మొత్తానికి ఇది ఒక అపూర్వమైన దృశ్యం. దీనిలో ప్రధాన పాత్రధారులుగా రాజగోపాలరెడ్డి, భాజపాలు కనబడుతున్నప్పటికీ, దీనికి మనం నిందించ వలసింది తెరాస, కాంగ్రెసుల నాయకత్వాలనే. శాసన సభకు ఎన్నికైన ప్రధాన ప్రతిపక్షం నుండి మూడింట రెండు వంతుల మంది కట్టకట్టుకుని అధికారపక్షంలో చేరి ఉండకపోతే, రాజగోపాలరెడ్డి ఈ అపురూప మైన సాహసం ప్రదర్శించి ఉండేవాడా?
ముందుగా, గుంపుగా పోయిన వారు ఎటువంటి ప్రలోభాలతో పోయినారో మనకు తెలియదా? రాజీనామా ఇవ్వవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి, సభాపతి వారికి ముందే హామీ ఇచ్చి ఉండాలి. మంత్రి పదవులు లభించగలవని, మళ్లీ ఎన్నికలు వచ్చి నపుడు అధికారపక్షం టికెట్ లభించగలదన్న ఆశ్వాసనా లభించి ఉండాలి.
ఈ హామీలేవీ లేకుండానే వారు విపక్షం నుండి అధికారపక్షంలోకి దూకి వచ్చారని నమ్మే అమాయకు లెవరూ లేనే లేరు. తన శాసన సభ్యులపై ఏమాత్రం నియంత్రణ, అదుపూ లేని కాంగ్రెసును ఈ విషయంలో ఎవరైనా నిలదీస్తున్నారా?ఏ పత్రికలోనైనా, సంపాదకీయాలు వ్రాయబడినవా?
తాను రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో రాజగోపాలరెడ్డి ఎటువంటి నసుగుడూ లేకుండా స్పష్టంగా చెబుతున్నారు. మొత్తం తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా, ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికలన్నీ కేవలం గజ్వెల్, సిరిసిల్ల, సిద్ధిపేట నియోజకవర్గాలకే పరిమితమౌతున్నవని, ఆపైన ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపఎన్నిక వస్తే, ఆ నియోజకవర్గంలోనే ఏదో ఒక మేరకు పనులు చేపట్ట బడుతున్నవని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని, తన నియోజకవర్గం అవసరాలగురించి శాసనసభ వేదికగా చెప్పిన విషయాలనుకూడా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ పరిస్థితులలో ప్రభుత్వానికి అర్థమయ్యే భాషలో మాట్లాడటం కాక తనకు మరొక ప్రత్యామ్నాయం లేదని ఆయన ఊరూరా తిరుగుతూ ప్రజలకు వివరిస్తున్నారు.
రాజీనామా అనంతరం ప్రభుత్వం లో చురుకు పుట్టి ఎంతోకాలంగా పడివున్న పనులలో కదలిక రావటం అందరూ చూస్తున్నదే! ఈ విషయాలన్నీ గమనించినపుడు రాజగోపాలరెడ్డి, భాజపాలు అభినందనీయులేగాని, నిందనీయులు కారు అనే అభిప్రాయం కల్గకమానదు.
2018 తర్వాత ఐదవ ఉపఎన్నిక ఇది
2018 శాసనసభ ఎన్నికల తర్వాత ఇది ఐదవ ఉప ఎన్నిక. ఇంతకు ముందు జరిగిన 4 ఉప ఎన్నికలలో తెరాస ఒకటి (హుజూర్ నగర్) గెల్చుకుంది, ఒకటి (నాగార్జున సాగర్) నిలుపుకొంది, రెండు (దుబ్బాక, హుజూరాబాద్) చేజార్చుకొంది. కాంగ్రెసు ఒకటి (హుజూర్ నగర్) చేజార్చుకొంది. కాగా భాజపా రెండు గెల్చుకుంది (దుబ్బాక, హుజూరాబాద్). ఇప్పుడు మునుగోడును తెరాస గెల్చుకొంటే, ఆ పార్టీ గెలుచుకున్నది రెండు అవుతాయి. కోల్పోయిన రెండింటిని కూడదీసుకొన్నట్లవుతుంది.
అధికార పక్షంగా తెరాసకు ఇక్కడ గెలుపు అనివార్యం. ఇక్కడ ఓడిపోతే ఇక ప్రజల మధ్యకు రావడానికి మొహం చెల్లదు. తమ శాసన సభ్యులతో సహా వివిధ స్థాయిలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీ ని వదిలేసి పోయే ప్రమాదం పొంచి ఉంది.
మునుగోడును గనుక కాంగ్రెస్ గెలుచుకున్నట్లయితే, ఆ పార్టీకి పోయిన ప్రాణం లేచివచ్చినట్లవుతుంది. కాగా భాజపా గెల్చుకొన్నట్లయితే, ఆ పార్టీకి ఇది మూడవ వరుస విజయమవుతుంది. తర్వాత జరిగే శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయం సునిశ్చయం అన్న అభిప్రాయం తిరుగులేని విధంగా బలపడుతుంది.
ఆ దృష్ట్యా మునుగోడు లో విజయం మూడు పార్టీలకూ ఎంతో కీలకమైంది. ఐదు ఆటల సీరియస్ లో రెండు పాయింట్లు ఇప్పటికే తమ ఖాతాలో వేసికొని భాజపా అందరికంటే ముందున్నది. మునుగోడు కూడా గెలిస్తే భాజపాకు ఆపైన అంతా అప్రతిహత పురోగమనమే. ఈ నేపధ్యంలో ఎవరు ఎలా తమ సామర్థ్యాలు ఋజువు చేసుకుంటారో చూద్దాం.
More Stories
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్
గగన్‌యాన్ ‘వ్యోమమిత్ర’లో ఏఐ ఆధారిత రోబో