కమ్యూనిజం పాశవికతపై కమ్యూనిస్టుల్లోనే తిరుగుబాటు!

సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ కీలక నేత, పొలిట్‌ బ్యూరో సభ్యురాలు కవితా కృష్ణన్‌ ఇటీవల పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. పార్టీ సెంట్రల్‌ కమిటీలో ఆమె 20 ఏళ్లకు పైగా సభ్యురాలిగా ఉన్నారు. పార్టీతో తనకు ఉన్న అభిప్రాయ భేదాల వల్లే తాను అన్ని పదవుల నుండి వైదొలుగుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
 
గతంలో కూడా వివిధ రకాల కమ్యూనిస్ట్ పార్టీల నుండి అనేకమంది అగ్రనాయకులు నిష్క్రమించారు. పదవులకు రాజీనామా చేశారు. అయితే వారెవ్వరూ పార్టీ మౌలిక విధానాలను ప్రశ్నిపలేదు. కానీ, బహుశా ఆమె అటువంటి ప్రశ్నలు లేవనెత్తడం కలకలం రేపుతున్నది. 
పార్లమెంటరీ ప్రజాస్వామ్యాల కంటే సోషలిస్టు పాలనలు నిరంకుశ పాలనలు అంటూ గతంలో ఆమె ఓ సారి  ట్వీట్ చేయడం గమనార్హం. అంతేకాదు, ‘ఫాసిజానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటం స్థిరంగా ఉండాలి. మనం భారత్ లో ఏవైతే పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామో.. అవే విలువలు ప్రపంచం అంతటా ఉండాలని కోరుకోవాలి’ అంటూ ఆమె వామపక్షవాదులకు హితవు చెప్పారు.
 
ఈ రోజు ప్రపంచ కమ్యూనిస్టులకు స్వర్గంగా భావిస్తున్న చైనా వ్యవస్థను ఆమె ప్రశ్నించారు. “ఈ రోజు కమ్యూనిస్టు దేశం చైనా సామ్యవాద పాలనకు బదులు నిరంకుశంలోకి జారిపోయింది. భారత కమ్యూనిస్టులు.. కమ్యూనిస్టు పాలన అంటే ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారా?” అంటూ ఆమె వామపక్ష వాదులను గతంలో నేరుగా ప్రశ్నించారు. 
 
కారల్ మర్క్స్ మతమును ఓ మత్తుమందుగా పేర్కొంటే,  ఆయన వారసులు సోషలిజంను ఒక మతంగా, కమ్యూనిజంను మతోన్మాదంగా మార్చారు. ఈ సిద్ధాంతాల మూలంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు చనిపోయారు. అందులో అత్యధికంగా కమ్యూనిజం పేరుతో చైనా, రష్యాలలోనే దారుణమైన చిత్రహింసలకు, హత్యలకు గురయ్యారు.
 
సోషలిజం/కమ్యూనిజం ప్రయత్నించిన ప్రతి దేశం విఫలమయింది, ప్రజలను నరకయాతన పెట్టింది. సోవియట్ యూనియన్ కుప్ప కూలింది. చైనాలో కమ్యునిస్టులు వాళ్ళ వింత పిచ్చుకలను చంపే విధానాల మూలంగా కనీసం మూడు కోట్ల మంది చనిపోయారు. కాంబోడియాలో కమ్యునిస్టులు దేశ పౌరులను ప్రతి ఏడుగురిలో ఒకరిని చంపేశారు.
 
ఇలా ఒక్కటి కాదు క్యూబా, ఉత్తర కొరియా, వెనిజువేలా అన్ని ఆర్థికంగా విఫలమయ్యాయి. వెనిజువేలా ఒకప్పుడు అమెరికా కన్నా సంపన్న దేశం. సోషలిజం పుణ్యమా అని ఈ రోజు ఆ దేశంలో జనాలు తిండి కూడా దొరక్క అల్లాడిపోతున్నారు. మరోవంక, పెట్టుబడిదారీ విధానాలు కొద్దిపాటి మోతాదులో అమలు చేసినా దేశాల దశ మారిపోయింది.
సింగపూర్ అరవై సంవత్సరాల క్రితం ఒక దుర్భరమైన మురికివాడ. ఈ రోజు సగటున అమెరికా కన్నా సంపన్న దేశం. తైవాన్, హాంగ్ కాంగ్, దక్షిణ కొరియా, మలేసియా లాంటి దేశాలు క్యాపిటలిస్టు విధానాల మూలంగా ఎనలేని సంపద సృష్టించాయి. ఈ దేశాలను చూసి చైనా కూడా తన విధానాలను మార్చుకొని భారతదేశం కన్నా ఆరింతల పెద్ద ఆర్థిక వ్యవస్థను సృష్టించింది.
 
 కమ్యూనిజం చేసిన మారణకాండ, ఆర్థిక విద్వంసం కూడా మనా కళ్ళెదుటే కనిపిస్తున్నది. 50 నుండి 60 లక్షల యూదులను చంపిన నాజీ సిద్ధాంతం అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ద్వేషిస్తున్నారు. మరి కనీసం పది కోట్ల మందిని పొట్టనబెట్టుకున్న కమ్యునిజం ఇంకా మన మధ్య ఎందుకు ఉంది? దీనిని పాతాళం లోతు పాతి పెట్టే రోజు ఎప్పుడు వస్తుంది? ఇటువంటి ప్రశ్నలే నేడు కవితా కృష్ణన్ ధోరణిలో తిరిగి తలెత్తుతుంది.
 
స్టాలిన్ పాలన, యుఎస్‌ఎస్‌ఆర్ లేదా చైనాను విఫలమైన సోషలిజంగా చర్చించడం సరిపోదని, ప్రతిచోటా నిరంకుశ పాలనలకు నమూనాగా పనిచేసిన ప్రపంచంలోని కొన్ని చెత్త నిరంకుశత్వాలను గుర్తించాల్సిన అవసరం ఉందని కృష్ణన్ సూచించారు.

కొన్ని సమస్యాత్మకమైన రాజకీయ ప్రశ్నలను తాను లేవనెత్తవలసిన అవసరం ఉందని భావిస్తున్నందున తాను సీపీఐ(ఎంఎల్) నాయకురాలిగా తన బాధ్యతలను అన్వేషించడం, వ్యక్తీకరించడం సాధ్యం కాదని గ్రహించి పార్టీ పదవులకు దూరం అవుతున్నట్లు ఆమె ప్రకటించారు.

“నాయకత్వంలో ఉంటూ ఇటువంటి ప్రశ్నలను లేవనెత్తడం సాధ్యం కాదు. ఇది రాజీనామా కాదు, పరస్పర అవగాహనతో బాధ్యతల నుంచి తప్పుకోవడం . పార్టీతో ఎలాంటి వైరం లేదు’ అని ఆమె స్పష్టత ఇచ్చారు.