రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత

ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌, దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మాంత్రికుడు   రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం క్యాండీ బ్రీచ్‌ హాస్పిటల్‌లో చేరారు. వారం రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

అయితే ఆదివారం ఉదయం  6.45 గంటలకు ఝున్‌ ఝన్‌ వాలా మరో సారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత‍్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం కాండీ బ్రీచ్ హాస్పిటల్‌కి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.

జూలై 5,1960లో హైదరాబాద్‌లో జన్మించిన రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలాకు చిన్న తనం నుంచి వ్యాపారం అంటే మక్కువ. అందుకే కాలేజీ విద్యార్ధిగా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. రాకేశ్ తండ్రి ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌. రాకేశ్ సిడెన్హామ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో ఎన్‌రోల్ అయ్యారు. 

ఓ వైపు సీఏ (చార్టర్డ్ అకౌంటెంట్‌) చదువు కుంటూనే స్టాక్‌ మార్కెట్‌లో మెళుకువలు నేర్చుకున్నారు. రాకేశ్ విద్యార్థి దశలోనే రూ.5,000 పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో ప్రవేశించారు. 2022 జూలైనాటికి ఆయన సంపద నికర విలువ 5.5 బిలియన్ డాలర్లు అని అంచనా. 

అయితే ఫోర్బ్స్ కథనం ప్రకారం ఆయన సంపద విలువ 5.8 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది.  ఆయన మన దేశంలోని సంపన్నుల జాబితాలో 36వ స్థానంలో ఉన్నారు. ఆప్టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 

ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్, జియోజీత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బిల్‌కేర్ లిమిటెడ్, ప్రజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రొవోగ్ ఇండియా లిమిటెడ్, కాంకర్డ్ బయోటెక్ లిమిటెడ్, వైస్‌రాయ్ హోటల్స్ లిమిటెడ్, టాప్స్ సెక్యూరిటీ లిమిటెడ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 

‘బిగ్ బుల్ ఆఫ్ ఇండియా’గా రాకేశ్‌ సుపరిచితులు. ‘కింగ్ ఆఫ్ బుల్ మార్కెట్’గా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. స్టాక్ మార్కెట్ జోస్యాలకు ఆయన పెట్టింది పేరు. భారత దేశ వారన్ బఫెట్ అని కూడా ఆయనకు పేరు ఉంది. 

కొద్ది రోజుల క్రితం ఏవియేషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన ఝున్‌ ఝున్‌ వాలా నూతన బడ్జెట్ వైమానిక సేవల సంస్థ ఆకాశా ఎయిర్  సేవలను ఇటీవలనే ప్రారంభించారు. మొదటి విమానం ముంబై నుంచి అహ్మదాబాద్ ప్రయాణించింది. ఆకాశా ఎయిర్‌ను రాకేశ్, జెట్ ఎయిర్‌వేస్ మాజీ సీఈఓ వినయ్ దూబే కలిసి ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ప్రస్తుతం 2 విమానాలు ఉన్నాయి. మరో 70 విమానాలకు ఆర్డర్ ఇచ్చారు. ఆగస్టు 9 నాటికి మూడు నగరాలకు ఈ విమానాల సేవలు విస్తరించాయి. 

ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం 

రాకేశ్ ఝున్‌ఝున్‌వాలామృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. మోదీ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఎదురులేని వ్యక్తి అని, గొప్ప విజ్ఞానవంతుడని, స్టాక్ మార్కెట్ అంశాల్లో మంచి పట్టు ఉన్న పెట్టుబడిదారు అని కొనియాడారు.  ఆయన జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించారని, హాస్య చతురత కలవారని తెలిపారు.

ఆర్థిక ప్రపంచానికి ఆయన నిష్కళంక సేవలందించారని తెలిపారు.  భారత దేశ అభివృద్ధి కోసం రాకేశ్ తపించేవారని తెలిపారు. ఆయన మరణించడం తీవ్ర విచారకరమని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆయనను అభిమానించేవారికి ప్రగాఢ సంతాపం, సానుభూతి చెప్తున్నట్లు తెలిపారు. ఓం శాంతి అని పేర్కొన్నారు.

రాకేశ్ మృతి పట్ల శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ప్రగాఢ సంతాపం తెలిపారు. బడ్జెట్ ఎయిర్‌లైన్ ఆకాశా ఎయిర్ సహ వ్యవస్థాపకుడైన ఆయన ఆ సంస్థ సేవలు ప్రారంభమైన కొద్దీ రోజులకే ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కేవలం స్టాక్ మార్కెట్ గురించి మాత్రమే ఆలోచించలేదని, దేశం కోసం ఆయన పరితపించారని ఆమె వివరించారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.