నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 రాకెట్‌

చిన్న చిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని (షార్‌) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించింది.

చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1ను ఇస్రో రూపొందించింది. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్‌ ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నారు.  ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్‌–2ఏ (ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌) ఉపగ్రహంతో పాటు దేశంలోని 75 జిల్లా పరిషత్‌ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ‘ఆజాదీ శాట్‌’ను ప్రయోగించారు.

ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహమే మైక్రోశాట్‌ 2ఏ. అధిక రిజల్యూషన్‌తో కూడిన ప్రయోగాత్మక ఆప్టికల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహం భూమికి తక్కువ ఎత్తులో ఉండి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి సమాచారాన్ని చేరవేస్తుంటుంది.