అడ్డదారిలో ఓట్లు సంపాదించే రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తాయి

అడ్డదారిలో ఓట్లు సంపాదించే రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తాయి

అడ్డదారిలో ఓట్లు సంపాదించడం సులభమే కానీ, ఆ తరహా రాజకీయాలు దేశాన్నే నాశనం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. అడ్డదారి రాజకీయాలకు పాల్పడేవారు ఎప్పటికీ కొత్త విమానాశ్రయాలు, రహదారులు, ఎయిమ్స్‌లు నిర్మించలేరని విపక్షాలపై పరోక్ష విమర్శలు చేశారు.

ఝార‍్ఖండ్‌లోని దేవఘర్‌లో సుమారు రూ.16,800 కోట్లతో చేపట్టిన నూతన అంతర్జాతీయ విమానాశ్రయం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు మోదీ.  అనంతరం దేవఘర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు.  673 ఎకరాల విస్తీర్ణంలో, రూ .401 కోట్ల వ్యయంతో డియోఘర్ విమానాశ్రయాన్ని నిర్మించారు

‘అడ్డదారి రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తాయి. ప్రస్తుతం ఈ అడ్డదారి రాజకీయాలు దేశానికి అతిపెద్ద సమస్యగా మారాయి. అలా ఓట్లు సులభంగా సాధించవచ్చు. ఒక దేశంలోని రాజకీయాలు అడ్డదారులుపై ఆధారపడితే.. అది అడ్డదారికే దారి తీస్తుంది. అలాంటి రాజకీయాలకు దూరంగా ఉండాలని దేశ ప్రజలను కోరుతున్నా. అలా అడ్డదారి  రాజకీయాలకు పాల్పడేవారు దేశాభివృద్ధి కోసం పనిచేయలేరు.’ అని  మోదీ స్పష్టం చేశారు.

దేవఘర్‌లో విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు తనకు అవకాశం లభించిందని, ఈరోజు అదే ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందని ప్రధాని చెప్పారు. గతంలో ప్రాజెక్టులు ప్రకటించటం.. 2-3 ప్రభుత్వాలు మారాక శంకుస్థాపన చేయటం జరిగేదని గుర్తు చేశారు. అలా కొన్ని ప్రభుత్వాలు మారాకే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవని విమర్శలు గుప్పించారు.

భారత్‌ భక్తి, ఆధ్యాత్మికత, పుణ్యక్షేత్రాలకు నిలయమని ప్రధాని పేర్కొన్నారు. తీర్థయాత్రలు మనల్ని మెరుగైన సమాజంగా, మంచి దేశంగా తీర్చిదిద్దుతాయని తెలిపారు. దేవఘర్‌లో జ్యోతిర్లింగంతో పాటు మహాశక్తి పీఠం ఉందని గుర్తు చేశారు. ప్రతి ఏటా లక్షల మంది భక్తులు దేవఘర్‌కు వచ్చి మహాశివుడిని దర్శించుకుంటారని తెలిపారు.

తొలుత ప్రధానికి జార్ఖాండ్‌లో మంగళవారం ఉదయం ఘనస్వాగతం లభించింది. రోడ్లకిరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. అనంతరం డియోఘర్ విమానాశ్రయాన్ని అధికారికంగా మోదీ ప్రారంభించారు. అనంతరం విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు ప్రారంభమైన ఇండిగో విమాన సర్వీసును కూడా జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. 2018 మే 25న ఈ విమానాశ్రయానికి మోదీ శంకుస్థాపన చేశారు. ప్రధాని జార్ఖాండ్ పర్యటనలో భాగంగా డియోఘర్‌లోని ఎయిమ్స్‌లో ఇన్-పేషెంట్ డిపార్ట్‌మెంట్, ఆపరేషన్ థియేటర్ సేవలను కూడా ప్రారభించారు. పలు రోడ్లు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.

12 జ్యోతిర్లింగాలలో ఒకటైన బాబా బైధ్యనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. వేదమంత్రాలు, శంఖారావాల మధ్య రుద్రాభిషేకం చేశారు. ఈనెల 14 నుంచి శ్రావణ మేళా ప్రారంభం కానుండటంతో బైద్యనాథుని దర్శనానికి వేలాది మంది భక్తులు, యాత్రికులు తరలి వస్తున్నారు.