మంగళూరులో 518 మంది `అక్రమ’ విదేశీయుల  గుర్తింపు

మంగళూరులో 518 మంది `అక్రమ’ విదేశీయుల  గుర్తింపు

కర్ణాటకలోని సముద్ర తీర ప్రాంత ప్రముఖ నగరమైన దక్షిణ కన్నడ జిల్లా కేంద్రం మంగళూరులో అక్రమంగా నివసిస్తున్న 518 మంది విదేశీయులను పోలీసులు గుర్తించారు. వివిధ దేశాల నుంచి విద్య, విజిటర్‌ వీసాలపై రాష్ట్రానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వారి వద్ద సరైన రికార్డులు లేనట్లుగా గుర్తించారు. 

నగర పరిధిలోని అన్ని ప్రాంతాల్లో నివసించే  వ్యక్తులను గుర్తించి వారి రికార్డులను పరిశీలించారు. వీరిలో 518 మంది విదేశీయులు ఉన్నట్లు గుర్తించామని వారికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్లు సోమవారం నగర పోలీసు కమిషనర్‌ శశికుమార్‌ మీడియాకు తెలిపారు. మంగళూరు పరిధిలో 18 పోలీసు స్టేషన్లు ఉండగా 4వేల మంది విదేశీయులను గుర్తించామని పేర్కొన్నారు. 

వీరిలో రికార్డులు సక్రమంగా లేనివారు 518 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మంగళూరు రోసారియో హాల్లో వారిని విచారిస్తున్నామని చెప్పారు. వీరిలో కొందరు ఒడిస్సా, సిక్కిం, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు చెందినవారుగా చెబుతున్నారని వివరించారు. 

రికార్డులతో పాటు వారు ఇచ్చిన వివరాలు, మొబైల్‌ నంబర్లు, గూగుల్‌ మ్యాప్‌ ద్వారా చిరునామాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. రికార్డులు లేని వారిని గుర్తించేందుకు 20 అంశాలను ప్రాతిపదికగా విచారిస్తున్నట్లు చెప్పారు.