
ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈరోజు ఉదయం వీధుల్లో నీరు నిలిచిపోయి వాహనదారులు తెగ ఇబ్బందిపడ్డారు. సియాన్, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయి. కొన్ని రూట్లలో రైళ్లు, బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రైల్వే ట్రాక్‌లపై వరద నీరు చేరుతోంది. ముంబైలో స్వల్ప స్థాయి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు భారతీయ వాతావరణ శాఖ తెలిపింది.
రాబోయే కొన్ని రోజుల్లో పలు చోట్ల అతిభారీ వర్షాలు పడే ఛాన్సు ఉన్నట్లు కూడా చెప్పింది. వర్షాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎప్ దళాలను అప్రమత్తం చేశారు. ముంబైతో పాటు సమీప జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదేశించారు.
కాగా, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతం, గోవా, కోస్తా కర్ణాటక, కేరళలో అక్కడక్కడ భారీ మొదలుకొని అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ముంబై, థానేలలో శుక్రవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తన ఐదు రోజుల అంచనాలో పేర్కొంది. మంగళవారం ఉదయం 8.30 గంటలతో ముగిసిన 24 గంటల్లో కోలాబా , శాంటాక్రూజ్ అబ్జర్వేటరీలు రెండూ వరుసగా మూడు అంకెలలో 117 మిమీ మరియు 124 మిమీ వర్షపాతం నమోదయ్యాయి.
మంగళవారం కూడా మొత్తం కొంకణ్ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురియొచ్చని వాతావరణ శాఖ ముంబైకి ‘ఆరెంజ్ అలర్ట్’ జారీచేసింది. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. ముంబైలో అయితే వాన నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారింది.
థానే జిల్లాలో ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో తిరుగాడటం ప్రజలకు కష్టంగా మారింది. సియోన్, చెంబూర్, బాంద్రా, ఎయిర్ ఇండియా కాలనీ, కుర్లా, తదితర ప్రాంతాల్లో వాన నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ప్రజలు, బస్సులు వేరే రూట్ల గుండా వెళ్లాల్సి వస్తోంది.
More Stories
భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
దేశంలో ర్యాగింగ్ మరణాల సంఖ్య 2020- 2024లో 51
ఈ నెల 29న సూర్యగ్రహణం