
‘‘అడ్డగోలుగా ఛార్జీల పెంపుతో జనం నడ్డి విరుస్తున్నావ్… రకరకాల పేర్లతో 3 ఏళ్లలో ఏకంగా 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదల రవాణాకు ఏకైక సాధనమైన బస్సు ప్రయాణాన్ని దూరం చేస్తున్నావ్…. పెంచిన బస్ ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో బీజేపీ చేపట్టే ఉద్యమాల సెగను చవి చూడక తప్పదు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడతాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హెచ్చరించారు.
బస్ ఛార్జీల పెంపు నేపథ్యంలో బండి సంజయ్ శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ ను సందర్శించారు. నేరుగా ప్రయాణీకులను కలిశారు. బస్సుల్లో కలియతిరుగుతూ ఛార్జీల పెంపుపై ప్రయాణీకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. బస్ ఛార్జీల పెంపుతో వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
పెరిగిన బస్ ఛార్జీలతో తమకు చాలా ఇబ్బంది ఎదురవుతోందని…. ఛార్జీల భారాన్ని మోయలేకపోతున్నామని ప్రయాణీకులు వాపోయారు. మొన్నటి వరకు ఫంక్షన్లకు ఫ్యామిలీతో కలిసి బస్సులో వెళ్లి వచ్చే వాళ్లమని…. కానీ పెరిగిన బస్ ఛార్జీల భారంతో కుటుంబంతో కలిసి ఫంక్షన్ కు వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నలుగురితో కలిసి బస్సులో వెళ్లడం కంటే ప్రైవేటు వాహనంలో వెళితేనే తమకు కలిసొస్తుందని చెప్పారు. ప్రయాణీకుల ఇబ్బందులను తెలుసుకునేందుకు వచ్చిన సంజయ్ తో ఆర్టీసీ పారిశుధ్య సిబ్బంది, తాత్కాలిక సిబ్బందితో పాటు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు కలిసి తమ సమస్యల గోడును వెలిబుచ్చారు.
ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమకు వేతనాలు పెరగడం లేదంటూ పారిశుధ్య సిబ్బంది వాపోయారు. తమకు కనీసం బస్ పాస్ సౌకర్యం కూడా లేదని, ఉన్నతాధికారులు తమను చీపురు పుల్లలా తీసిపారేస్తున్నారని వాపోయారు. తమకు రెండు పీఆర్సీలు ఇవ్వలేదని, 5 డీఏలు పెండింగ్ లో పెట్టారంటూ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
వారి బాధలన్నీ విన్న సంజయ్ ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు, కార్మీకులకు అండగా ఉండేందుకు తమ పార్టీ క్రుషి చేస్తోందని హామీ ఇచ్చారు. అట్లాగే పెంచిన బస్ ఛార్జీలను తగ్గించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.
ఈ రాష్ట్రంలో పేదలు, మధ్య తరగతి ప్రజలు బతకడం కేసీఆర్ ప్రభుత్వానికి అస్సలు ఇష్టం లేనట్లుంది. ఇప్పటికే అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచిండు… ఆస్తి పన్ను పెంచిండు… నల్లా బిల్లులు పెంచిండు… వ్యాట్ పేరుతో పెట్రోలుపై లీటర్ కు 30 రూపాయలు దండుకుంటుండు.. ఇట్లా అన్నీ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరగ్గొడుతున్న కేసీఆర్ ఇప్పుడు మళ్లా ఆర్టీసీ ఛార్జీలను ఎడాపెడా పెంచేసిండని సంజయ్ ధ్వజమెత్తారు.
సామాన్యుడు ఎటు వెళ్లాలన్నా దిక్కుగా ఉన్న ఆర్టీసీ బస్సును కూడా దూరం చేస్తున్నడు. ప్రజల బతుకును ఆగమాగం చేస్తుండని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇఫ్పటి వరకు ప్రయాణీకులపై సగటున 60 శాతంపైగా ఆర్టీసీ ఛార్జీలను పెంచిండని, ఇక కనీస టిక్కెట్ ధరను వంద శాతం పెంచారని విమర్శించారు.
అసలు ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సిన అవసరమేముంది? అని ప్రశ్నించారు. అప్పుడంటే కార్మికుల సమ్మెవల్ల ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందంటివి. ఛార్జీలు పెంచకపోతే ఆర్టీసీని మూసేయాల్సిన దుస్థితి ఉందంటివి… మరి ఇప్పుడేమైంది? డీజిల్ సెస్ పేరుతో 20 నుండి 30 శాతం ఛార్జీలు పెంచితివి. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినందున ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని మళ్లీ కథలు చెబుతుంటివని అంటూ మండిపడ్డారు.
More Stories
ప్రకృతితో సమతుల్యతతో జీవించడమే ఆయుర్వేదం
ఆసియాకప్లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి