వారణాసి బాంబు పేలుళ్ళలో దోషిగా ఉగ్రవాది వలియుల్లా ఖాన్

వారణాసి బాంబు పేలుళ్ళలో దోషిగా ఉగ్రవాది వలియుల్లా ఖాన్
సుప్రసిద్ధ పుణ్య క్షేత్రాల నగరం వారణాసిలో పదహారేళ్ళ క్రితం జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ఉగ్రవాది వలియుల్లా ఖాన్ దోషి అని ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ కోర్టు  తీర్పు చెప్పింది. ఖాన్‌కు శిక్షను జూన్ 6న ఖరారు చేస్తామని తెలిపింది.  2006 మార్చి 7న వారణాసిలోని సంకట్ మోచన్ దేవాలయం, కంటోన్‌మెంట్ రైల్వే స్టేషన్ల వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికిపైగా గాయపడ్డారు.
ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి జితేంద్ర కుమార్ సిన్హా  ఇచ్చిన తీర్పులో రెండు కేసుల్లో ఉగ్రవాది వలియుల్లా ఖాన్ దోషి అని తెలిపారు. హత్య, హత్యాయత్నం, తీవ్రంగా గాయపరచడం, ఆయుధాలను అక్రమంగా వినియోగించడం తదితర నేరారోపణలతో ఈ కేసులను పోలీసులు దాఖలు చేశారు.
ఓ కేసులో ఖాన్‌కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు అతనిని నిర్దోషిగా విడుదల చేసింది. జూన్ 6 సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇతనికి శిక్షను ఖరారు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది రాజేశ్ శర్మ తెలిపారు. వలియుల్లాకు బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీతో సంబంధాలు ఉన్నాయని ఈ కేసులను దర్యాప్తు చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ తెలిపింది. ఈ పేలుళ్ళ సూత్రధారి ఇతనేనని పేర్కొంది.
2006 మార్చి 7న సాయంత్రం 6.15 గంటలకు సంకట్ మోచన్ దేవాలయంలో మొదటి పేలుడు సంభవించింది. 15 నిమిషాల తర్వాత వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లోని మొదటి తరగతి విశ్రాంతి గది వద్ద మరొక పేలుడు సంభవించింది. అదే రోజు దశాశ్వమేధ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద కుకర్ బాంబు పేలింది.
వారణాసిలోని న్యాయవాదులు ఈ కేసుల్లో వాదనలు వినిపించేందుకు నిరాకరించడంతో విచారణను ఘజియాబాద్ జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. మొత్తం మూడు కేసుల్లో విచారణ జరిగింది. మొత్తం మీద 121 మంది సాక్షులను కోర్టు విచారించింది.