రిషికొండపై జగన్ కు `సుప్రీం’లో ఎదురుదెబ్బ!

రిషికొండపై జగన్ కు `సుప్రీం’లో ఎదురుదెబ్బ!
రిషికొండ తవ్వకాల విషయంలో సుప్రీంకోర్టులో వైఎస్  జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. హైకోర్టులో తేలేంతవరకూ ఇకపై కొత్త తవ్వకాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాత రిసార్ట్ ఉన్న ప్రాంతంలో మాత్రమే  కొత్త నిర్మాణాలు చేపట్టడానికి సుప్రీం కోర్టు అనుమతించింది.
 
అంతకు ముందు రుషికొండ తవ్వకాలపై సుప్రీంకోర్టులో వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. మొత్తం కొండను తొలిచేశారని  పునరుద్ధరించడం సాధ్యం కాదని ఎంపీ రఘురామ కృష్ణరాజు  తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్‌ కోర్టుకు తెలిపారు. రిషికొండ ఫొటోలను లాయర్‌ బాలాజీ శ్రీనివాసన్‌  ధర్మాసనం ముందు ఉంచారు. 
 
జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ హిమాకోహ్లి ధర్మాసనం ఫొటోలు పరిశీలించింది. హైకోర్టులో ధిక్కరణ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని బాలాజీ శ్రీనివాసన్‌ సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించారు. పిటిషన్‌లో మీరెందుకు చేరకూడదని ధర్మాసనం ప్రశ్నించింది. తప్పుగా తేలితే వాళ్లు జైలుకు వెళతారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు ఉన్నాయని, ఇప్పుడు ఎన్జీటీ స్టే ఎత్తేస్తే  ముప్పు వాటిల్లే ప్రమాదముందని బాలాజీ శ్రీనివాసన్‌ తెలిపారు. గత కమిటీ నివేదికలో అంశాల ఆధారంగా ఎన్జీటీ తాజాగా మరో కమిటీని నియమించింది. కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ పరిధిలోకి వస్తుందా లేదా? కొండను తొలి చేయడం మంచిదా కాదా తెలుసుకోవడానికే  ఎన్జీటీ తాజా కమిటీని నియమించినట్టు బాలాజీ శ్రీనివాసన్‌ కోర్టుకు వెల్లడించారు.
హైకోర్టు, ట్రైబ్యునల్‌, సుప్రీంకోర్టు ఒక్కోటి ఒక్కో ఉత్తర్వులు ఇస్తే ఎలా?  హైకోర్టుకు వెళ్లొచ్చు కదా అని ధర్మాసనం సూచించింది. హైకోర్టు, ఎన్జీటీ పరస్పర విరుద్ధ ఆదేశాలతో యంత్రాంగంలో గందరగోళం నెలకొందని, రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతవరకు ఎన్జీటీలో విచారణ జరపరాదని ఆదేశించింది.
నిర్మాణానికి అనుమతులు తీసుకుని మొత్తం కొండలు ఎలా తొలిచేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అనుమతుల ప్రకారమే నిర్మాణాలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ తెలిపారు. ఫోటోలు చూస్తే అలా కనిపించడం లేదని, పాత ఫోటోలు- కొత్త ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది.
అక్కడ ఉన్న పచ్చదనం అంతా మాయమైందని వ్యాఖ్యానించింది. భవనాల నిర్మాణం వేరు, కొండను తొలిచేయడం వేరు అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. రిసార్టు నిర్మాణానికి మొత్తం కొండలు తొలిచేస్తే ఎలా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది.
మైదాన ప్రాంతంలో నిర్మాణం వేరు, ఇలాంటి కొండపైన నిర్మాణం చేయడం వేరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిర్మాణాలకు సంబంధించి వ్యవహారమంతా ఫొటోలు చూపుతున్నాయని పేర్కొంది. నిర్మాణాలకు మాత్రం అనుమతిస్తామని, కానీ, కొండను, అక్కడ ఉన్న పర్యావరణానికి ముప్పు లేకుండా చేపడతామని హామీ ఇవ్వగలరా అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు.
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచించింది. గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో పాత భవనాలు తొలగించిన చోట మాత్రం నిర్మాణాలు జరపడానికి వెసులుబాటు ఇస్తున్నట్లు తెలిపింది.