
‘పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకం కింద ప్రయోజనాలను విడుదల చేస్తూ, కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల రోజువారీ అవసరాలను తీర్చేందుకు వివిధ పథకాల ద్వారా రూ.4,000 అందించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు. వారి పాఠశాల చదువు పూర్తయ్యేవరకు రూ 20,000 చొప్పున ఉపకారవేతనం, 23 ఏళ్ళ వయస్సు వచ్చేసరికి రూ 10 లక్షల ఆర్ధిక సహాయం లభిస్తుందని ప్రధాని వివరించారు.
అమ్మానాన్నలను కోల్పోయిన పిల్లలకు.. ఆప్యాయత, వాళ్లు లేరనే లోటు పూడ్చలేనిదని ప్రధాని మోదీ పేర్కొంటూ అయినా భరత మాత మీ వెంట ఉందంటూ పిల్లలకు ఆయన భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారితో అనాథలైన పిల్లలకు చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్ ఫర్ చిల్ట్రన్’ పథకం అమలు చేయాలని నిర్ణయించుకుంది. కేంద్రంలో తన ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ క్రమంలో.. సోమవారం పథక ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. “ఎవరైనా ప్రొఫెషనల్ కోర్సుల కోసం, ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే, ‘పిఎం కేర్స్’ దానికి కూడా సహాయం చేస్తుంది” అని ప్రధాని వెల్లడించారు. అంతే కాకుండా 18 నుంచి 23 ఏళ్ల లోపు వారికి స్టైఫండ్ అందజేస్తామని ప్రకటించారు.
పాఠశాలలకు వెళ్లే చిన్నారులకు ఉపకార వేతనాలతో పాటు పీఎం కేర్స్ పాస్ బుక్, ఆయుష్మాన్ భారత్, జన్ ఆరోగ్య యోజన హెల్త్ కార్డులను పంపిణీ చేస్తారు. లబ్ధిదారులకు ఐదు లక్షల వరకు అవసరమయ్యే వైద్య ఖర్చులను కేంద్రమే భరిస్తుంది. కేవలం చదువు పట్ల శ్రద్ద చూపడమే కాకుండా ఖేల్ ఇండియా, ఫిట్ ఇండియా కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొనాలని, వచ్చే నెలలో జరిగే యోగా దినోత్సవంలో కూడా పాల్గొనాలని విద్యార్థులను ప్రధాని కోరారు.
పీఎం కేర్స్ ఫండ్.. కరోనా టైంలో ఆస్పత్రుల సన్నద్ధత, వెంటిలేటర్ల కొనుగోలు, ఆక్సిజన్ ప్లాంట్‌ల ఏర్పాటుకు తోడ్పింది. తద్వారానే ఎన్నో ప్రాణాలు నిలిచాయి. అయినా దురదృష్టవశాత్తూ కొందరిని దేశం కోల్పోయింది. కరోనాతో చనిపోయిన వాళ్ల బిడ్డలకు తోడ్పాటుగా, వాళ్ల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకే పీఎం కేర్స్ ఫండ్ ఇప్పుడు ఉపయోగపడుతోందని అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
“మీ తల్లిదండ్రుల ప్రేమను ఏ ప్రయత్నం భర్తీ చేయకపోవచ్చు. అండగా భరతమాత మీ వెంటే ఉంటుంది. పీఎం కేర్స్ ద్వారా ఈ దేశం మీ ప్రయోజనాలను నెరవేరుస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తో, సంస్థో లేదంటే ఈ ప్రభుత్వం చేసే ప్రయత్నం మాత్రమే కాదు.. పీఎం కేర్స్‌లో కోట్ల మంది ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును విరాళంగా ఇచ్చారు” అని ప్రధాని మోదీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలకు వెళ్లే పిల్లలకు స్కాలర్‌షిప్‌లు బదిలీ చేస్తారు. అలాగే పిల్లల కోసం పిఎం కేర్స్ యొక్క పాస్‌బుక్ , ఆయుష్మాన్ భారత్ కింద ఒక హెల్త్ కార్డ్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కూడా హాజరయ్యారు.
More Stories
ఆపరేషన్ సింధూర్ తో ముక్కలైన మసూద్ కుటుంబం
న్యూయార్క్ టైమ్స్పై ట్రంప్ 15 బిలియన్ డాలర్ల దావా
తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి వైపు చూస్తున్న నేపాల్