తాండూరు సీఐని బండబూతులు తిట్టిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి!

తాండూరు సీఐని బండబూతులు తిట్టిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి!
వికారాబాద్‌ జిల్లా తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి బండబూతులు తిట్టిన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో కలకలం రేపుతున్నది. 
 ఏప్రిల్‌ 23న (శనివారం) తాండూరు పట్టణంలో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డుగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులతో కూర్చున్నా.. సీఐ రాజేందర్‌రెడ్డి వారించలేదనే ఆగ్రహంతోనే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఈ ఫోన్‌కాల్‌ చేసినట్లు తెలుస్తోంది.
శనివారం తాండూరులో భావిగి భద్రేశ్వర స్వామి జాత‌రలో పట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ముందుగా వెళ్లిన ఎమ్మెల్సీ, నేతలు ఆనవాయితీగా పరిచిన రెడ్‌ కార్పెట్ పై కూర్చున్నారు. అనంతరం ఎమ్మెల్యే వెళ్లగా ఆలయ నిర్వాహకులు మరో రెడ్‌ కార్పెట్‌ వేశారు. 
 
అయితే దేవుడి విగ్రహం ముందు, పూజకు దగ్గరగా ఎమ్మెల్యే కూర్చున్నారు. వెనక వచ్చిన ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇచ్చారంటూ ఎమ్మెల్సీ అనుచరులు చర్చించుకుని, ఇందుకు తాండూర్‌‌ టౌన్‌ సీఐ రాజేందర్‌ రెడ్డినే కారణమని ఆరోపిస్తూ మహేందర్ రెడ్డికి చెప్పారు. దానితో బుధవారం సీఐకి మహేందర్‌‌రెడ్డి ఫోన్ చేసి బండ బూతులు తిట్టారు. 
 
ద‌మ్ముంటే కేసు పెట్టుకో అంటూ స‌వాల్ చేశారు. ఆ ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీంతో సీఐ తాను డ్యూటీ చేస్తున్న స్టేష‌న్‌లోనే పట్నం మహేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీపై 353, 504, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ తీరును పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి ఖండించారు. 
 
ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహేందర్ రెడ్డి తీరును ఖండిస్తూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మద్దతుదారులు బుధవారం రాత్రి తాండూరులో ఆందోళనలు చేశారు.
 
గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫైలట్ రోహిత్ రెడ్డి అధికార టీఆర్ ఎస్ లో చేరారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతల మధ్య వర్గ పోరు నెలకొంది.
 
అయితే, తాండూరు టౌన్ సీఐ రాజేందర్ రెడ్డిని తాను బూతులు తిట్టలేదని పట్నం మహేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఇదంతా కావాలనే కొంతమంది సృష్టించారంటూ కొట్టిపారేశారు. శనివారం తాండూరులో భావిగి భద్రేశ్వర స్వామి జాత‌రలో వేదికపై ఉన్న తనను ఇద్దరు రౌడీషీటర్లు ఇబ్బంది పెట్టారని, ఇదే విషయంపై తాండూరు టౌన్ సీఐ రాజేందర్ రెడ్డిని వివరణ అడిగానని చెప్పారు. 
 
ఆ ఆడియోలో వాయిస్ తనది కాదని అంటూ, ఇదంతా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేయించి ఉంటారని ఆరోపించారు. ఈ కేసును కోర్టులోనే న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. 
 
ఇలా ఉండగా, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తనపై అసభ్య పదజాలంతో దూషించారని  రాజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.   ‘‘నాకు చాలా బాదేసింది. నాపై చేసిన వ్యాఖ్యాలు పై నేను ఫిర్యాదు చేశాను. కేసు నమోదు చేశారు, ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తారు” అని తెలిపారు. 
 
 కాగా,తాను  ఇసుక మాఫియాకు, రౌడీ షీటర్లకు కొమ్ము కాస్తున్నట్లు ఆరోపణలలో వాస్తవం లేదని సిఐ కొట్టిపారేసారు రౌడీ షీటర్లకు కొమ్ము కాస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై వారి పేర్లు బయట పెట్టాలని కోరారు. పైగా, తాను  లాంగ్ లీవ్‌లో వెళ్ళినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని చెబుతూ  ఆన్ డ్యూటీలోనే ఉన్నట్లు  వెల్లడించారు. 
 
మరోవంక, మహేంద్రరెడ్డిపై ఈ సందర్భంగా పాత కేసులు ఒకొక్కటి పైకి వస్తున్నాయి. పాత వివాదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం రంజాన్ తోఫా పంపిణీ సందర్భంగా యాలాల ఎస్ఐ అరవింద్ కుమార్ ని దుర్భాషలాడారంటూ కేసు నమోదు అయ్యింది. యాలాలలో జరిగిన గొడవలో తన వర్గానికి చెందిన నేతలను పోలీసులు తీసుకెళ్తుండటంతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
గొడవ సందర్భంగా ఎస్ఐ అరవింద్ ను  బూతులు తిట్టారు. దీనిపై ఎస్ ఐ తీవ్ర మనస్తాపం చెందారు. అరవింద్ ఫిర్యాదు మేరకు యాలాల పోలీస్ స్టేషన్ లో పట్నం మహేందర్ రెడ్డిపై ఐసీపీ 353, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.