తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు భరోసాగా అమిత్ షా!

తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు భరోసాగా అమిత్ షా!
బిజెపిని లక్ష్యంగా చేసుకొని తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు బిజెపి కార్యకర్తలపై వేధింపు చర్యలకు పాల్పడుతూ, వారిలో భయం కలిగించడంకోసం చేస్తున్న ప్రయత్నాల పట్ల  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది.  తాజాగా రాష్ట్రంలో జరిగిన రెండు ఆత్మహత్యల ఘటనల్లో మంత్రి, మున్సిపల్‌ చైర్మన్, టీఆర్‌ఎస్‌ నేతల బెదిరింపులు, వారి ప్రోద్భలంతో పోలీసుల వేధింపులను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
బీజేపీ కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసానిచ్చేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఆయనే స్వయంగా ఖమ్మంలో పోలీస్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బిజెపి కార్యకర్త సాయి గణేష్ కుటుంభం సభ్యులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. 
 
బీజేపీ పట్ల అధికార టీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరిపై, బీజేపీని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర సర్కార్, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సమగ్ర నివేదిక తెప్పించుకున్నారు. పార్టీ ఎమ్యెల్యే ఎన్ రఘునందనరావు, ఇతర నాయకులు బుధవారం గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ను కలసి సాయి గణేష్ ఆత్మహత్యపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. 

ఖమ్మంలో సాయి గణేశ్​ కుటుంబానికి మరో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్,  ఎంపీ సోయం బాపూరావు, ఇతర ముఖ్యనేతలు గణేశ్‌ కుటుంబాన్ని నేడు పరామర్శించనున్నారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించే గణేశ్‌ సంతాప సభకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. 

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెండు ఆత్మహత్య ల ఘటనలపై నిజానిజాలను తెలుసుకునేందుకు అమిత్‌షా ఖమ్మం, రామాయంపేటలకు లీగల్‌సెల్‌ బృందాలను పంపించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో పార్టీ జెండా ఎగురవేసిన సాయిగణేశ్‌పై మంత్రి, టీఆర్‌ఎస్‌ నేతల ఆదేశాలతో పోలీసులు రౌడీషీటు ఓపెన్‌ చేయడంపై అమిత్‌షా ఆగ్రహంగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

టీఆర్‌ఎస్‌ నేతలు, వారికి మద్దతుగా పోలీసులు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం ఇటీవల ఎక్కువ కావడంతో హోంమంత్రికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. 

అలాగే గతంలో పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతుల హత్య, కొత్తగూడెంలో ఎమ్మెల్యే తనయుడు రాఘవేందర్‌ అరాచకాలు, అతని వేధిం పులతో నలుగురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య, తాజాగా చోటు చేసుకున్న రెండు ఆత్మహత్యల ఘటనల వెనుక టీఆర్‌ఎస్‌ నాయకుల వేధింపుల నేపథ్యంలో అమిత్‌ షా, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. 

నిజాంను మించిన నిరంకుశ పాలన
 కాగా,తెలంగాణలో కేసీఆర్‌ పాలన నిజాం నిరంకుశ పాలనను మించిపోయిందని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి  ఈటల రాజేందర్‌ విమర్శించారు. ఖమంలో ఆత్మహత్య చేసుకున్న బిజెపి కార్యకర్త సాయి గణేష్‌ కుటుంబాన్నిబిజెపి నేతలు పరామర్శించిన  సందర్భంగా  మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ నేతలు, పోలీసులు అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.
 
శిశుపాలుడు ఏ విధంగా 100 తప్పులు చేసి శిక్షకు గురయ్యాడో సీఎం కేసీఆర్‌ కూడా వంద తప్పులు చేశారని, ఇక శిక్ష తప్పదని హెచ్చరించారు.  సాయి గణేష్‌ ఆత్మహత్యకు కారకులైన టిఆర్‌ఎస్‌ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజానీకం కేసీఆర్‌పై విశ్వాసం కోల్పోయారని ఈటల స్పష్టం చేశారు.