సాయి గణేష్ కుటుంబ సభ్యులకు అమిత్ షా ఫోన్

సాయి గణేష్ కుటుంబ సభ్యులకు అమిత్ షా ఫోన్
ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న  బీజేపీ అనుబంధ మజ్దూర్‌ సంఘ జిల్లా అధ్యక్షుడు సాయి గణేష్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ ఉదయం సాయి గణేష్ అమ్మమ్మ సావిత్రి, చెల్లి కావేరితో ఫోన్లో మాట్లాడిన అమిత్ షా. ధైర్యంగా ఉండాలని చెప్పారు.  
 
సాయి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  ఆత్మహత్య ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పారు.  షా. సాయి గణేష్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు ఆయనను కోరారు.
 
కాగా,  సాయిగణేష్‌ ఆత్మహత్యపై సిట్టింగ్‌ జడ్జితో కానీ, జ్యుడీషియల్‌ విచారణ కానీ జరిపించాలని  బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సన్నె ఉదయ్‌ప్రతాప్‌  తదితరులు   ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ను కలిశారు. 
 
సాయిగణేష్‌ బలవన్మరణానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కార్పొరేటర్‌ భర్త ప్రసన్న కృష్ణ, పోలీసుల వేధింపులే కారణమని వారు ఆరోపించారు. గణేష్‌ చనిపోయేముందు మీడియాకు చెప్పిన మాటలను మరణవాంగ్మూలంగా పరిగణించి వారిపై కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.  టీఆర్‌ఎస్‌ నాయకుల ఒత్తిడితో పోలీసులు గణేష్ పై దాదాపు 15 కేసులు నమోదు చేసినట్లు వారు విమర్శించారు. 
 
 అజయ్ ని బర్తరఫ్ చేయాలి
 
రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైన మంత్రిపై కేసు నమోదు చేసి, ఏ వన్ గా చేర్చాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కేసులు పెట్టి వేధిస్తోందని ఆమె ధ్వజమెత్తారు.
 
ప్రభుత్వం పెద్దలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర గవర్నర్ పట్ల ప్రభుత్వం వ్యవహరించని తీరు సరిగా లేదన్న ఆమె గవర్నర్ పర్యటనలో కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం దురదృష్టకరమని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు గవర్నర్ పై బాడీ షేమింగ్ కు పాల్పడటం సిగ్గు చేటని ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ఖమ్మం రాకుండా అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదని స్పష్టం చేశారు.