అవినీతిలో కూరుకు పోయిన వారికి మంత్రి పదవులు 

అవినీతిలో కూరుకు పోయిన వారికి మంత్రి పదవులు 
అవినీతిలో కూరుకుపోయిన వారిని..కేబినెట్‌లోకి తీసుకున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. జగన్ మంత్రివర్గంలో మంత్రులకు అసలు అధికారం  ఉందా? అని ప్రశ్నించారు. 
 
బీసీలకు జగన్‌ సీఎం పదవి ఇవ్వగలరా? అని నిలదీశారు. టీడీఆర్‌ స్కాంలో ఉన్న కారుమూరికి పదవా? అని నిలదీశారు. పాత హోంమంత్రి సుచరిత డీఎస్పీనైనా బదిలీ చేశారా? వనిత కానిస్టేబుల్‌ని అయినా బదిలీ చేయగలరా? అని సోమువీర్రాజు ఎద్దేవా చేశారు. 
 
 కాగా,వైసీపీలో అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయని బిజెపి ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. నిన్నటివరకు మాకు ఒక్కడే నాయకుడు అన్నవాళ్లు.. ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏడుపులు, పెడబొబ్బలతో వైసీపీ పతనం మొదలైందని స్పష్టం చేశారు. 
 
మంత్రివర్గ కూర్పులో జగన్ పాటించిన విధానం ఏంటి? మంత్రులను తొలగించడంలో సలహాదారుడికి అధికారం ఎక్కడిది?.అని ప్రశ్నించారు. ప్రధాన సలహాదారు రాజ్యాంగ బద్ధమైన పదవి కాదని అంటూ సజ్జల వ్యవహారంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులాల నేతలను అణగదొక్కారని జీవీఎల్‌ విమర్శించారు.
ఇలా ఉండగా, జగన్ కొత్త కేబినెట్‌తో రాష్ట్రానికి ఒరిగేది లేదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  ఎమ్మెల్సీ పివిఎన్  మాధవ్‌ తప్పుబట్టారు.  వైసీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఉత్తరాంధ్ర మంత్రులు చొరవ చూపాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం నిధులు ఇవ్వడం లేదనేది అవాస్తవమని మాధవ్‌ పేర్కొన్నారు.