18 పైబడ్డ వారందరికీ బూస్టర్ డోస్

దేశంలో 18 సంవత్సరాలు పైబడ్డ యుక్తవయస్కులందరికి (అడల్ట్) కొవిడ్ బూస్టర్ డోస్‌లు వేస్తారు. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ ఆరంభం అవుతుందని ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. కరోనా పూర్తిస్థాయి ఆటకట్టుకు కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ బూస్టర్ నిర్ణయం తీసుకుంది. 

అయితే ఈ బూస్టర్ డోస్ లేదా ప్రికాషన్ డోస్ తీసుకునే వారు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలోనే ఈ బూస్టర్ డోస్ సౌకర్యం ఉంటుంది. రెండవ డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన 18ఏళ్లు పైబడినవారందరూ బూస్టర్‌ డోసు తీసుకునేందుకు అర్హులని కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో ఆరోగ్య పరిరక్షణ కార్యకర్తలు, పారిశుద్ధ ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి ఈ బూస్టర్ డోస్‌లను ఉచితంగానే కల్పిస్తున్నారు.

ఇప్పుడు ఉన్న దేశ వ్యాప్త ప్రభుత్వ ఆధ్వర్యపు వ్యాక్సినేషన్ సెంటర్లు (తొలి, మలి డోస్‌లకు సంబంధించినవి) ఇకపై కూడా కొనసాగుతాయి. వీటి ద్వారా ప్రజలు మొదటి, రెండవ డోస్‌లు పొందవచ్చు. ఇప్పటివరకు 15 ఏండ్లు అంతకు మించి ఉన్న వారిలో దాదాపు 96 శాతం తొలి డోస్ పొందారు.

ఇక దాదాపు 83 శాతం వరకూ రెండు డోసలు పొందారని అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని దేశాలలో కొత్త రకం కరోనా  రకాలు వ్యాపించడం, అంతర్జాతీయ ప్రయాణాలు పెరగడంతో బూస్టర్ డోస్ ఆవశ్యకత ఏర్పడిందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి ప్రకటనలో తెలిపింది. దీనితో దేశంలోని యుక్త వయస్కులు అంతా బూస్టర్ డోస్‌కు అర్హులు అవుతారు. 

కొన్ని దేశాలు బూస్టర్ డోస్ పొంది ఉన్న వారికే అనుమతి కల్పిస్తున్నాయి. దీనిని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఇప్పుడు బూస్టర్ అవకాశం కల్పించింది.ఇజ్రాయెల్ వంటి దేశాలు బూస్టర్ డోస్‌లు పొందిన వారినే తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి. అమెరికాలో కూడా ఈ నిబంధన ఉంది. 

దేశంలో ఇటీవలి కాలంలో ఎక్స్‌ఇ అంతకు ముందు ఒమిక్రాన్ వంటి వేరియంట్లు తలెత్తాయి. అయితే మొత్తం మీద దేశంలో వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. గడిచిన 24 గంటలలో కొత్తగా 1109 మందికి వైరస్ సోకింది. ఇక కరోనా తీవ్రతతో 43 మంది చనిపోయారు.