
చట్టసభలకు శాసనాలను చేసే అధికారం లేదని హైకోర్టు ఎలా చెబుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకస్తూ రణ అంశంపై గురువారం అసెంబ్లీలో చేపట్టిన లఘు చర్చ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మూడు రాజధానుల అంశంపై తీర్పు ఇవ్వడంలో రాష్ట్ర హైకోర్టు తన పరిధి దాటిందని స్పష్టం చేశారు.
ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు తన పరిధి దాటిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపించారు. ఏదేమైనా పరిపాలనా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేసి తీరతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మూడు రాజధానుల అంశానికి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయసలహా తీసుకుని ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తామని తేల్చిచెప్పారు.
మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టాలను వాపసు తీసుకున్నాక.. ఇక ఆ అంశానికి తావెక్కడిదని అంటూ హైకోర్టు తీర్పుపై ప్రశ్నించారు. ప్రస్తుతం 3 రాజధానుల చట్టం అమలులో లేదని.. అమరావతి రాజధానిగానే ఉందని గుర్తు చేసారు. దేశ సమాఖ్య స్ఫూర్తిని.. శాసనసభ అధికారాలనూ హరించేలా ఈ తీర్పు ఉందని జగన్ విమర్శించారు.
రాజధానిపై కేంద్రానికి ఎలాంటి అధికారమూ ఉండదని.. కేంద్రం పాత్ర కూడా ఉండదని చెబుతూ ఇదే విషయాన్ని అదనపు అఫిడవిట్లో కేంద్రం కూడా పేర్కొందని గుర్తు చేశారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రం పరిధిలోనిదని లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని వేసిన ప్రశ్నకు కేంద్రం క్రిస్టల్ క్లియర్‌గా తేల్చిచెప్పిందని జగన్ తెలిపారు.
హైకోర్టునూ, దాని అధికారాలనూ అగౌరవపరచడానికి ఈ చర్చ పెట్టలేదని.. రాష్ట్ర హైకోర్టుపై తమకు అత్యంత గౌరవం ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశా రు. అలాగే రాష్ట్ర అసెంబ్లీ.. దాని గౌరవాన్ని కాపాడుకోవలసిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.
రాజధాని వికేంద్రీకరణపై గౌరవ చట్ట సభకు తీర్మానం చేసే అధికారమూ లేదని కోర్టు తీర్పు ఇవ్వడం శాసన వ్యవస్థలోనికి న్యాయవ్యవస్థ చొరబడడడమేనని పేర్కొంటూ ఇది అవాంఛనీయ ఘటనగా జగన్ అభివర్ణించారు. రాజధానితో పాటు.. ఆ ప్రాంతంలో 3 నెలల్లోపు లక్ష కోట్ల రూపాయల విలువైన కాలువలు, రోడ్లు, నీటి సరఫరా పనులు చేయాలని, ఆరు నెలల్లో రూ.5 లక్షల కోట్ల పనులు చేయాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు.
అసాధ్యమైన పనులు ఆరు నెలల్లో చేయాలనడం సరికాదని హైకోర్టు కు హితవు చెప్పారు. ఇలాంటి తీర్పులు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలకు పూర్తి భిన్నమని స్పష్టం చేస్తూ రాజధాని మాస్టర్ ప్లాన్ పూర్తిగా గ్రాఫిక్స్‌లో ఉందని, పేపర్‌కే పరిమితమై ఉందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చేసిన చట్టాలూ, పాలనా నచ్చలేదనే 151 స్థానాలతో వైసీపీకి అఽధికారమిచ్చారని ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వ నిర్ణయాలు.. పాలనా వ్యవహారాలు.. చట్టాలు నచ్చకపోతే ఐదేళ్లలో ప్రజలు ఇంటికి పంపేస్తారని, ఇదే ప్రజాస్వామ్యంలో ఉన్న సౌందర్యమని తెలిపారు. కోర్టులు పాలనా వ్యవస్థల్లో జొరబడలేవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం మొదట అభివృద్ధి జరగనందుకు వచ్చిందని, తర్వాత ఉద్యమం.. అభివృద్ధి అంతా హైదరాబాద్‌కే కేంద్రీకృతం కావడం వల్ల వచ్చిందని జగన్ గుర్తు చేశారు.
వికేంద్రీకరణ వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ, రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేసిన శివరామకృష్ణన్ కమిటీ వెల్లడించాయని ఆయన చెప్పారు. మూడు రాజధానుల బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రంలో న్యాయ, కార్యనిర్వాహక, శాసన రాజధానులకు కట్టుబడి పాలనా వికేంద్రీకరణ చేస్తామని స్పష్టంగా చెప్పామని గుర్తు చేశారు.
రాజ్యాంగానికే కాకుండా శాసనసభ అధికారాలనూ హరించే విధంగా హైకోర్టు తీర్పు ఉందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తమ పరిధిని దాటిందని అనిపిస్తోంది కాబట్టి శాసనసభలో ఇవాళ సభ అధికారాలపై చర్చ జరుగుతోందని తెలిపారు. 2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్ణయం కేంద్ర పరిధిలోనిదని హైకోర్టు పేర్కొనడాన్ని తప్పుబట్టారు.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ట్రంప్ వీసా రుసుం పెంపుపై భారత్ అత్యవసర నంబర్!
ఆర్థిక మాంద్యం ముప్పు దిశగా అమెరికా