
ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ విరామాన్ని ప్రకటించింది. దీంతో 10 రోజులుగా ఉక్రెయిన్‌లో కొనసాగుతోన్న యుద్ధ వాతావరణం తాత్కాలికంగా సద్దుమణిగింది. భారత విద్యార్థులను, విదేశీయులను ఉక్రెయిన్ నుంచి తరలించేందుకు రష్యా ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు రష్యన్ అధికారి తెలిపారు.
ఉక్రెయిన్‌లోని మరియుపోల్, వోల్నోవాఖా నగరాల్లో శనివారం పాక్షిక కాల్పుల విరమణను పాటిస్తామని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించడంలో సాయపడతామని రష్యా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. ఈరోజు ఉదయం 11.30 గంటలకు కాల్పులను ఆపేసినట్లు రష్యా వెల్లడించింది.
ఐదున్నర గంటల పాటు ఎలాంటి దాడులు జరపమని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులను తరలించడంతో పాటు దేశ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ విరామం ప్రకటించినట్లు వెల్లడించింది.
తమను రక్షించాలంటూ భారతీయ విద్యార్థులు వేడుకుంటున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన నేపథ్యంలో ఈ అంశంపై రష్యా స్పందించింది.భారతీయులతో పాటు విదేశీయులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా చెప్పింది.
భారతీయులు, ఇతర దేశీయుల కోసం తమ దేశంలోని బెల్గారాడ్ ప్రాంతం నుంచి 130 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఖార్కోవ్, సుమీతోపాటు ఇతర ప్రాంతాలనుంచి అందరినీ తరలిస్తామని, మార్గమధ్యంలో ప్రత్యేక చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసి, తాత్కాలిక వసతి కూడా కల్పిస్తున్నట్లు రష్యా చెప్పింది.
నీరు, ఆహారం, మందులు వంటివి కూడా అందిస్తామని తెలిపింది. విదేశీయుల్ని ప్రత్యేక ఎయిర్‌బేస్‌కు తరలించి, అక్కడ్నుంచి వాయుమార్గంలో తమ దేశాలకు వెళ్లే ఏర్పాట్లు చేస్తామని రష్యా వెల్లడించింది. మరోవైపు విదేశీయుల్ని ఉక్రెయిన్ బంధీలుగా చేసుకుంటోందని రష్యా విమర్శించింది.
కాల్పుల విరమణకు భారత్ చర్చలు
కాగా, యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తెచ్చేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని కేంద్రం ప్రకటించింది. ఒకవైపు ‘ఆపరేషన్ గంగ’ ప్రాజెక్టులో భాగంగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇది సాధ్యపడటం లేదు.
ఖార్కివ్, సుమీ వంటి ప్రాంతాల్లో నిత్యం బాంబు దాడులు, కాల్పులు జరుగుతుండటంతో ఆ ప్రాంతాల్లో ఉన్న భారతీయులు బయటకు రాలేని పరిస్థితి. ఈ కారణంగా అక్కడ చిక్కుకుపోయిన వెయ్యి మందికిపైగా భారతీయులను తీసుకురాలేకపోతోంది భారత ప్రభుత్వం.
దీంతో భారతీయులను సురక్షిత ప్రాంతాలకు చేర్చే వరకు కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ, ఉక్రెయిన్-రష్యా ప్రభుత్వాలతో మాట్లాడుతున్నామని భారత ఎంబసీ ప్రకటించింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు దాదాపు 120 బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అయితే, భారతీయులు ఉన్న ప్రదేశానికి చేరే మార్గంలో 50-60 వరకు క్లిష్టమైన ప్రాంతాలున్నాయి. ఈ ప్రదేశాల్లో నిత్యం కాల్పులు జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రయత్నాలు పూర్తిగా సత్ఫలితాల్నివ్వడం లేదు. అయితే, బస్సులను వేరే మార్గంలో తరలించేందుకు ఉన్న అంశాలను పరిశీలిస్తున్నామని ఇండియన్ ఎంబసీ చెప్పింది.
More Stories
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!