
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు జిల్లా పునర్విభజన సెగ తగిలింది. ఆయన కాన్వాయ్‌ను శనివారం మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీశైలం వెళ్తూ శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు మంత్రి ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆగారు.
ముందుగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి దేవస్థానానికి వెళుతున్న క్రమంలో మార్కాపురం జిల్లా సాధన సమితి చేపట్టిన రిలే దీక్ష శిబిరం వద్దకు రాగానే జేఏసీ నాయకులు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నాలు చేసి విఫలమయ్యాయి.
దీంతో మంత్రి శ్రీనివాస్ కారులో నుంచి దిగి వారి సమస్యలను విన్నారు. మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని, పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
రాయలసీమలో 1600 అభ్యంతరాలు
ఇలా ఉండగా, రాయలసీమలో జిల్లాల పునర్విభజనపై 1600 వరకు అభ్యంతరాలు వచ్చాయని ఏపీ ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రతి అంశాన్ని పూర్వపరాలు పరిశీలించి వాస్తవ పరిస్థితి ఏంటనేది చూస్తున్నామని చెప్పారు. పుట్టపర్తి జిల్లా కేంద్రం ఏర్పాటుపై ఒక భావన వ్యక్తం అయిందని, పెనుకొండ , హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు కోసం డిమాండ్ ఉందని పేర్కొన్నారు.
ఏ విధంగా జిల్లా కేంద్రం ఏర్పాటు ఉండాలనేది పరిశీలనలో ఉందని చెప్పారు. కలెక్టర్లు వారికి వచ్చిన అభ్యంతరాలు సలహాల మీద వాస్తవ పరిస్థితి ఏవిధంగా ఉందనే దానిపై ప్రభుత్వం నుంచి తుది నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. జిల్లాలు ఏ రోజు నుంచి ఆవిర్భావం అవుతాయనే దానిపై తుది నోటిఫికేషన్‌లో తెలియచేస్తామని వెల్లడించారు.
తిరుపతి కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలోకి నెల్లూరు జిల్లా నుంచి కొన్ని మండలాలు కలుస్తాయని చెబుతూ ఆ మండలాల వరకు మాత్రమే జోనల్ సమస్య ఉన్నట్లు పేర్కొన్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంకల్పమని విజయ్ కుమార్ తెలిపారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ