
ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్ వేదికగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హైదరాబాద్ లోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో మోదీ పాల్గొంటూ ఇక్రిశాట్లో ఫొటో గ్యాలరీ, పంటల క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ లోగో, స్మారక స్టాంపును మోదీ ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
సంస్థలో పనిచేసిన, చేస్తున్న ఉద్యోగులకు ఇక్రిశాట్ స్వర్ణోత్సవ శుభాకాంక్షలను ఆయన తెలిపారు. ఇక్రిశాట్ 50 ఏళ్ల ప్రయాణం పెద్ద మైలురాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగమైన అందరికీ అభినందనలు తెలిపారు. వసంతపంచమి రోజు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
టెక్నాలజీని మార్కెట్ తో జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్ ఎంతో కృషి చేస్తుందని ప్రధాని అభినందించారు. సరికొత్త సంకల్పంతో ఇక్రిశాట్ మరింత ముందుకు సాగాలని మోదీ ఆకాక్షించారు. ఈ పరిశోధనలు చిన్న, మధ్య తరగతి రైతులకు ఎంతో ఉపయోగమని చెప్పారు.
వాతావరణ మార్పుల అంశానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాని తెలిపారు. భారత్‌లో వ్యవసాయానికి విభిన్నమైన సంప్రదాయాలున్నాయని చెబుతూ భవిష్యత్ అంతా డిజిటల్ వ్యవసాయానిదేనిని మోదీ స్పష్టం చేశారు.
ఆజాదీ కీ అమృతోత్సవ్ వేళ ఇక్రిశాట్ స్సర్ణోత్సవాలను జరుపుకుంటుందని చెబుతూ మెట్ట ప్రాంత రైతులకు ఇక్రిశాట్ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ప్రధాని కొనియాడారు . తావరణ మార్పుల కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు.
ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మానవ నష్టం గురించి చర్చిస్తామని చెబుతూ, దేశంలో ప్రాచీన, వైవిధ్యమైన వ్యవసాయ విధానం ఉందని గుర్తు చేశారు. 25 ఏళ్ల లక్ష్యంతో ముందుకెళ్తున్నామని పేర్కొంటూ ఇక్రిశాట్ కూడా ప్రత్యేక లక్ష్యాలతో ముందుకెళ్లాలని సూచించారు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారని..నీరు, మట్టి మేనేజ్ మెంట్ పై అద్భుతమైన పరిశోదనలు చేశారని ప్రధాని ప్రశంసించారు.
తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పాదకత సాధించాలని చెబుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంటల దిగుబడి గణనీయంగా ఉందని ప్రధాని తెలిపారు. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రంపచానికి కొత్త దారి చూపించాలని అభిలాషను వ్యక్తం చేశారు. పంటకాలం తక్కువగా ఉండే వంగడాల సృష్టి మరింత జరగాలని పేర్కొంటూ వాతావరణ మార్పులకు తట్టుకునే వంగడాలను సృష్టించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదం చేయాలని ప్రధాని చెప్పారు. భారత్ లో 80 శాతం మంది చిన్న కమతాల రైతులు ఉన్నాయని గుర్తు చేస్తూ దేశంలో చిన్న రైతులు సంక్షోభం ఎదుర్కొంటున్నారని, చిన్న రైతుల సాగు వ్యయం తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు.
పంటల దిగుబడిపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తాయన్న ఆయన దేశ వ్యవసాయ రంగ బలోపేతానికి శాస్త్రవేత్తలు మరింత కృషి చేయాలని పిలుపిచ్చారు. భారత్ లో 6 రుతువులు 15 రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని, భారత్ లో 50 వరకు ఆగ్రో క్లైమేట్ జోన్లు ఉన్నాయని ప్రధాని వివరించారు.
జై జవాన్.. జై కిసాన్ మనందరికీ తెలుసని, కానీ జై విజ్ఞాన్..జై అనుసంధాన్ నినాదాలను వాటికి ప్రధాని మోదీ చేర్చారని కేంద్ర వ్యవసాయం శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. నూతన సంకల్పంతో ఇక్రిశాట్ ముందుకు సాగాలని చెబుతూ కొత్త వంగడాల సృష్టితో మరింత ముందుకు సాగాలని సూచించారు. మరో 25 ఏళ్లలో వ్యవసాయరంగంలో పెనుమార్పులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు తోమర్, కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇక్రిశాట్ లో సాగు సంబంధిత ఎగ్జిబిషన్ ప్రధాని తిలకించారు
ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరం
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యనటకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రధానికి స్వాగతం పలికే కార్యక్రమానికి ఆయన గైర్హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని స్వాగత కార్యక్రమానికి హాజరయ్యారు. మోదీకి స్వాగతం పలకడం మొదలు తిరిగి ఢిల్లీకి పయనమ్యయే వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని వెంట ఉంటారని శుక్రవారం సీఎంఓ వర్గాలు తెలిపాయి.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!