ప్రపంచానికి దారి చూపే రామానుజాచార్యుల బోధనలు

రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ని దివ్యక్షేత్రంలో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితమివ్వడంతో పాటు 120 కిలోల స్వర్ణ శ్రీమూర్తికి ప్రధాని మోడి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ చినజీయర్ స్వామి తనతో విష్వక్సేనేష్ఠి యజ్ఞం చేయించారని ఆ యజ్ఞఫలం 130 కోట్ల ప్రజలకు అందాలనే అభిలాషను వ్యక్తం చేశారు. దేశంలో అందరూ సమానంగా అభివృద్ధి చెందాలంటే ఐక్యమత్యంతో సాగాలని సబ్కా సాథ్.. సబ్కా వికాస్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు. ఉజ్వల్ పథకం, జన్ధన్, స్వచ్ఛ్ భారత్ వంటి పథకాలన్నీ అందులో భాగమేనని పేర్కొన్నారు.
ఆయన బోధనల్లో ఒకవైపు జ్ఞాన సముపార్జనకు మార్గాలున్నాయనీ.. మరోవైపు భక్తి మార్గాన్ని ఎలా అనుసరించాలో తెలిపారనీ ప్రధాని చెప్పారు. సన్యాసాన్ని స్వీకరించి సిద్ధి పొందడానికి ఒక పరంపరను సృష్టించిన మహానుభావుడు రామానుజాచార్యుడని తెలిపారు. దేశ ఏకతకు రామానుజాచార్యులు స్ఫూర్తి ఎంతో అవసరమని చెబుతూ  సమాజంలో అంతరాలను రామానుజాచార్య వెయ్యేళ్ల క్రితమే తొలగించారని గుర్తు చేసారు.
అందరినీ సమానంగా చూశారని, అనాడే ఆయన ఆదర్శాలు దేశవ్యాప్తంగా విస్తరించాయని ప్రధాని పేర్కొన్నారు. రామానుజాచార్యులు దళితులను ఆలయ ప్రవేశం చేయించారని, మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటారని మోదీ చెప్పారు.  రామానుజాచార్యుల సమతాసూత్రం మన రాజ్యాంగానికి స్ఫూర్తి అని ప్రధాని వివరించారు.

సమతామూర్తి బోధనలో వైరుధ్యం ఎప్పుడూ రాలేదని ప్రధాని స్పష్టం చేశారు. రామానుజాచార్యులు అంధవిశ్వాసాలను పారదోలారని, అలాగే ఆయన భక్తికి కులం, జాతి లేదని చాటిచెప్పారని మోదీ గుర్తుచేశారు. మనిషికి జాతి కాదు గుణం ముఖ్యమని లోకానికి చాటి చెప్పిన మహనీయుడు రామానుజాచార్యులని తెలిపారు. 

ప్రగతి శీలత, ప్రాచీనతలో భేదం లేదని రామానుజాచార్యను చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు. వెయ్యేళ్ల కిందట మూఢ విశ్వాసాలు ఎంతగా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమేనని పేర్కొంటూవాటిని తొలగించేందుకు రామానుజాచార్యులు ఎంతో కృషి చేశారని మోదీ గుర్తుచేశారు. ఆనాడే రామానుజాచార్యులు దళితులను కలుపుకుని ముందుకు సాగారని, ఆలయాల్లో దళితులకు దర్శన భాగ్యం కల్పించారని వివరించారు. 

అసమానతల నివారణకు కృషి చేసిన ఆధునిక నాయకుడు అంబేడ్కర్ అని ఆయన అభివర్ణించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా రామానుజాచార్యుల ప్రవచనాలనే చెప్పారని ప్రధాని గుర్తు చేశారు.స్వాతంత్య్ర పోరాటంలో ఐక్యత, సమానతదీ కీలకపాత్ర అని ప్రధాని వెల్లడించారు. హైదరాబాద్ ఏర్పాటులో సర్దార్ పటేల్ కీలకపాత్ర పోషించారని, ఆయన చాణక్యం వల్లే హైదరాబాద్‌కు విముక్తి లభించిందని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు.

మన సంస్కృతిలో గురువే జ్ఞానానికి కేంద్రమని, జగద్గురు రామానుజాచార్యుల బోధనలు సదా అనుసరణీయమని ప్రధాని పేర్కొన్నారు. మనం గురువును దేవుడితో కొలుస్తామని, ఇది మన భారతదేశ గొప్పతనమని చెప్పారు. రామానుజాచార్యుల ప్రతిభ, వైరాగ్యం ఆదర్శాలకు ప్రతీకని, ఆయన ముందు తరాలకు ప్రేరణగా నిలిచారని ప్రధాని స్పష్టం చేశారు.

శ్రీరామనగరం చేరుకున్న ప్రధాని తొలత యాగశాలకు వెళ్లారు. యాగశాలలో విశ్వక్సేనేస్టి పూజలో చిన్న జీయర్ స్వామి ప్రధానికి కంకణధారణ చేయించడంతో పాటు మెడలో పూలమాల వేసి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ప్రధాని శ్రీరామచంద్ర పెరుమాళ్‌ను దర్శించుకుని సమతామూర్తి ప్రాంగణంలో డిజిటల్ గైడ్ ద్వారా 108 దివ్యదేశ నమూన ఆలయ విశేషాలను తెలుసుకున్నారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆలయాల విశిష్టతలను, సమతామూర్తి ప్రాంగణం విశిష్టతలను ప్రధాని మోదీకి వివరించారు. ఆ తర్వాత రామానుజాచార్యుల విగ్రహానికి ప్రధాని పూజలు చేసి శిలాపలకాన్ని ఆవిష్కరించి 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల విగ్రహాన్ని లోకార్పణ చేశారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామానుజ చిన్నజీయర్ స్వామి శ్రీరామానుజాచార్యుల ప్రతిమను బహూకరించారు.

ఈక్రమంలో లేజర్ షోను ఆవిష్కరించిన ప్రధాని యాగశాలకు చేరుకుని హోమం గుండం దగ్గర ధ్యానం చేశారు. 5వేల మంది రుత్వికులు ప్రధానికి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ప్రధాని 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకుని దివ్యదేశాల విశిష్టతలను తెలుసుకున్నారు. భద్రవేదిక మొదటి అంతస్తులో ఉన్న 120 కిలోల సమతామూర్తి బంగారు విగ్రహాన్ని ఆయన సందర్శించారు.

ఆ తర్వాత భద్రవేదికపై సమతామూర్తి విగ్రహానికి పూజలు చేశారు. తిరునామం, పట్టు వస్త్రాల్లో వచ్చిన మోదీ  వేద పండితుల్ని అనుకరించారు. ప్రధానిమోదీతో రుత్వికులు సంకల్పం చేయించారు. అనంతరం రామానుజ జీవిత చరిత్ర విశేషాల గ్యాలరీని సందర్శించారు.