ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాజీ జాయింట్ డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్‌ను భారతీయ జనతాపార్టీ ఎన్నికల బరిలోకి దించింది. స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన రాజేశ్వర్ సింగ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సరోజినినగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్ కేసులో కార్తీ చిదంబరం, ఆయన తండ్రి కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంలను రాజేశ్వర్ సింగ్ విచారించారు.రాజేశ్వర్ సింగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి మాతృసంస్థ అయిన బీజేపీలోకి చేరారని కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు.
2009 నుంచి యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఎయిర్ సెల్ మ్యాక్సిస్ అవినీతి కేసుల దర్యాప్తులో రాజేశ్వర్ సింగ్ కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్, మిత్రపక్షాల అగ్రనేతలు కీలక నిందితులుగా బయటపడిన 2జి స్పెక్ట్రమ్ కేటాయింపు కేసు, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం కేసులను రాజేశ్వర్ సింగ్ విచారించారు.
ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా వంటి వారిపై గల కేసులను సహితం దర్యాప్తు జరిపారు. ఈడీ అధికారితో ఆయన సారధ్యంలో మనీ లాండరింగ్ కేసులలో రూ 4,000 కోట్ల మేరకు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
24 ఏళ్లపాటు ప్రభుత్వంలో వివిధ హోదాలలో సేవలు అందించిన ఆయన రెండు రోజుల క్రితమే స్వచ్ఛంద పదవీవిరమణ పొందారు. బి టెక్ చదివి, పోలీస్, మానవహక్కులు, సామజిక న్యాయంలో పిహెచ్ డి చేసిన ఆయన ఉత్తర ప్రదేశ్ పోలీస్ లో వివిధ హోదాలలో పనిచేసి, 2007లో ఈడీలో చేరారు. ప్రస్తుతం లక్నో కేంద్రంగా జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య లక్ష్మి సింగ్ సహితం ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం లక్నో ఐజి గా పనిచేస్తున్నారు.
రాజేశ్వర్ సింగ్ కొత్త ఇన్నింగ్స్ కు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శుభాకాంక్షలు తెలిపారు. దానికి రాజేశ్వర్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న స్వాతి సింగ్ స్థానంలో ఈయనను రంగంలోకి దింపారు. రాజేశ్వర్ సింగ్ బీజేపీలో చేరడంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది.బీజేపీ నాయకుడు రాజేశ్వర్ సింగ్ మాట్లాడుతూ, తాను పాలనను మెరుగుపరుస్తానని, మాఫియాలకు వ్యతిరేకంగా తన పనిని కొనసాగిస్తానని చెప్పారు.

More Stories
గవర్నర్ ను కలిసిన విజయ్ …. రేపే ప్రమాణం!
జలంధర్, అమృత్సర్ సైనిక కేంద్రాల వద్ద ప్రేలుళ్ళు!
కేరళంలో ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ లో పోటా పోటీ!