మణిపూర్‌‌లో అన్ని సీట్లలో బీజేపీ పోటీ

మణిపూర్‌‌లో అన్ని సీట్లలో బీజేపీ పోటీ

మణిపూర్‌లో నేషనల్ పీపుల్స్ పార్టీతో భారతీయ జనతా పార్టీకి ఉన్న పొత్తు ఫలించక పోవడంతో ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి వెళ్తున్నట్లు బీజేపీ ఆదివారం ప్రకటించింది. నిన్నటి వరకు ఎన్‌పీపీతో కలిసే బీజేపీ పోటీ చేయనుందని అనుకున్నప్పటికీ ఇరు పార్టీ మధ్య సీట్ల పంపకాల్లో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తున్నది. 

60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో 40 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం ఎన్‌పీపీ అధినేత,  కోన్రాడ్ సంగ్మా ప్రకటించారు. అయితే సగం స్థానాలు కావాలని బీజేపీ పట్టు పట్టినట్లు తెలిసింది. 
 
కొద్ది రోజుల క్రితం ఇరు పార్టీలు కలిసి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఆ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి వై.జోయ్ కుమార్‌లతో పాటు ఇరు పార్టీల అధినేతలు పాల్గొన్నారు. 
 
ఈ  అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి పొత్తులు లేకుండా మొత్తం 60 స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు మొత్తం 60 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇవాళ ప్రకటించింది. సీఎం ఎన్. బీరెన్ సింగ్ హీన్‌గాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
 
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ ‘‘రాబోయే మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి 60 స్థానాల్లో తమ అభ్యర్థుల్ని నిలబెడుతున్నాం. రాష్ట్రంలో 2/3 వంతు మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.
 
 మణిపూర్‌‌లో మరోసారి అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. మణిపూర్‌‌లో తమ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడడంతో పాటు ఎంతో అభివృద్ధి చేసిందని పేర్కొంటూ  రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని, అన్ని స్థానాలకూ అభ్యర్థులను నిర్ణయించామని ప్రకటించారు. 
 
 పార్టీ కోసం సుదీర్ఘ కాలం నుంచి పని చేసిన వారికే మెజారిటీ సీట్లు కేటాయించామని భూపేంద్ర యాదవ్  తెలిపారు. 60 శాతానికి పైగా సీట్లలో బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పారు. మణిపూర్‌‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో ఓటింగ్, మార్చి 10న కౌంటింగ్ ఉంటుంది.