ఒమిక్రాన్‌తో రిస్క్ ఎక్కువే.. తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వు

కొత్త క‌రోనా వేరియంట్ ఒ మిక్రాన్‌తో రిస్క్ చాలా తీవ్ర స్థాయిలో ఉన్న‌ట్లు ఇవాళ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆ వేరియంట్ వ‌ల్ల పెను ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్లు చెప్పింది. అయితే ఆ వేరియంట్ వ్యాప్తిస్తున్న తీరు, అది ఎంత ప్ర‌మాద‌క‌ర‌మ‌న్న విష‌యం అస్ప‌ష్టంగా ఉన్న‌ట్లు కూడా డ‌బ్ల్యూహెచ్‌వో వెల్ల‌డించింది. 
 
ఒక‌వేళ ఒమిక్రాన్ వేరియంట్ వ‌ల్ల వైర‌స్ హెచ్చు స్థాయిలో ప్ర‌బ‌లితే, దాని ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో త‌న టెక్నిక‌ల్ నోట్‌లో తెలిపింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఒమిక్రాన్ వ‌ల్ల మ‌ర‌ణాలు నమోదు కాలేదు.
 
కాగా,  ఒమిక్రాన్  వేరియంట్ డెల్టా క‌న్నా ఆరు రెట్లు ప్ర‌మాదక‌ర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. భార‌త్‌లో రెండో వేవ్ స‌మ‌యంలో డెల్టా వేరియంట్ పెను విషాదాన్ని మిగిల్చిన విష‌యం తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్‌లో ఉన్న విప‌రీత‌ మ్యుటేష‌న్లను నిర్వీర్యం చేయ‌డం క‌ష్ట‌మ‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. 
 
పైగా, మోనోక్లోన‌ల్ యాంటీబాడీ థెరపీ కానీ కాక్‌టెయిల్ ట్రీట్మెంట్ కూడా ఒమిక్రాన్ వేరియంట్‌ను నిర్వీర్యం చేయ‌ద‌ని ఫార్మా నిపుణులు చెబుతున్నారు. ద‌క్షిణాఫ్రికాలో నిర్వ‌హించిన ప్రిలిమిన‌రీ విశ్లేష‌ణ ద్వారా వాళ్లు ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. డెల్టా వేరియంట్ క‌న్నా ఒమిక్రాన్ క‌రోనా ఆర్ వాల్యూ ఆరు రెట్లు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు గుర్తించారు. 
 
రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌పై పెను ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంటున్నారు. వ్యాక్సిన్లు కూడా ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. తీవ్ర న‌ష్టాన్ని మిగిల్చిన డెల్టా వేరియంట్‌  మోనోక్లోన‌ల్ యాంటీబాడీ థెర‌పీకి స్పందించింది. అయితే డెల్టా నుంచి వ‌చ్చిన డెల్టా ప్ల‌స్ వేరియంట్ మాత్రం మోనోక్లోన‌ల్ థెరపీకి స్పందించ‌లేదు. 
 
నిజానికి మోనోక్లోన‌ల్ చికిత్స ఓ అద్భుత‌మ‌ని మొద‌ట్లో అనుకున్నారు. కానీ డెల్టా ప్ల‌స్‌పై ఆ చికిత్స ప‌నిచేయ‌క‌పోవ‌డం కొంత ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇక ఒమిక్రాన్‌పై ఆ యాంటీబాడీ చికిత్స ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.
 
ఇలా ఉండగా,  ఒమిక్రాన్‌లో ఉన్న G339D, S373P, G496S, Q498R, Y505H స్పైక్ ప్రోటీన్లు మోనోక్లోన‌ల్ యాంటీబాడీల‌ను త‌ట్టుకోగ‌ల‌వ‌ని ఐజీఐబీలో ప‌నిచేస్తున్న రీస‌ర్చ్ స్కాల‌ర్ మెర్సీ రోఫినా తెలిపారు. ఎటిసివిమాబ్‌, బామ్ల‌నివిమాబ్‌, క‌సిరివిమాబ్‌, ఇండివిమాబ్‌తో పాటు వాటి కాక్‌టెయిల్స్‌ను కూడా ఒమిక్రాన్ త‌ట్టుకుంటుంద‌ని రోఫినా తెలిపారు.