28న ఇండో-ఏసియా శిఖ‌రాగ్ర స‌ద‌స్సులో ప్రధాని

28న ఇండో-ఏసియా శిఖ‌రాగ్ర స‌ద‌స్సులో ప్రధాని

ఈ నెల 28న 18వ ఏసియ‌న్‌-ఇండియా శిఖ‌రాగ్ర స‌ద‌స్సు జ‌రుగనుంది. వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రుగ‌నున్న ఈ సద‌స్సుకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతోపాటు వివిధ దేశాల అధినేత‌లు హాజ‌రుకానున్నారు. 

బ్రూనై సుల్తాన్‌ ఆహ్వానం మేరకు ప్ర‌ధాని ఈ కార్యక్రమానికి వ‌స్తున్నారు. ఇక ఏసియ‌న్‌-ఇండియా స‌మ్మిట్‌కు ముందు ఈ నెల 27న జరిగే 16వ తూర్పు ఆసియా దేశాల స‌ద‌స్సులో కూడా ప్ర‌ధాని మోదీ పాల్గొననున్నారు.

ఏసియ‌న్‌-ఇండియా స‌ద‌స్సులో భార‌త్‌, ఆసియా దేశాల మ‌ధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ప‌రిస్థితుల‌పై సమీక్ష నిర్వ‌హిస్తారు. అదేవిధంగా కొవిడ్‌-19, ఆరోగ్యం, వాణిజ్యం, వ్యాపారం, అనుసంధానం, విద్య, సంస్కృతితోపాటు ప‌లు కీలకరంగాల్లో సాధించిన పురోగతిపై ఈ స‌మావేశంలో సమీక్షిస్తారని భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

కరోనా అనంతర ఆర్థిక పురోగతితో సహా ముఖ్యమైన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చ‌ర్చించ‌నున్నారు. గత ఏడాది నవంబర్‌లో జరిగిన 17వ ఏసియ‌న్‌-ఇండియా శిఖరాగ్ర సమావేశానికి కూడా ప్రధాని హాజరయ్యారని, ఈ ఏడాది పాల్గొంటే 9వ సారి ఆయ‌న ఈ స‌ద‌స్సుల్లో పాల్గొన్న‌ట్లు అవుతుంద‌ని విదేశాంగ‌శాఖ వెల్ల‌డించింది.