
గత నాలుగేళ్ల పాలనలో ఉత్తరప్రదేశ్ ను నేరాల నుండి విముక్తి కలిగిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల నినాదంతో ఎన్నికలకు సిద్దమవుతున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తీవ్ర నేర ఆరోపణలు ఉన్న పోలీస్ సిబ్బందిని తొలగించాలని గురువారం ఆదేశించారు.
తీవ్రమైన నేరాలకు పాల్పడిన పోలీస్ అధికారులు, సిబ్బందిని గుర్తించి, సంబంధిత ఆధారాలతో నిబంధనల ప్రకారం వారిని డిస్మిస్ చేయాలని సీఎంవో కార్యాలయం ప్రకటించింది. అవినీతి, నేర ఆరోపణలు ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి కీలక పోస్టింగ్‌లు ఇవ్వవద్దని పేర్కొంది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.
‘పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది అనధికార కార్యకలాపాలలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇది ఆమోదయోగ్యం కాదు. అలాంటి వ్యక్తులకు పోలీసు శాఖలో చోటు లేదు’ అని సీఎం ఆదిత్యనాథ్ పేర్కొన్నట్లుగా ఆ ప్రకటనలో ప్రస్తావించారు.
కాగా, గోరఖ్‌పూర్ హోటల్‌లో బస చేసిన కాన్పూర్ రియల్టర్ మనీష్ గుప్తా పోలీసుల దాడిలో మరణించిన నేపథ్యంలో ఆయనను కొట్టి మరణానికి కారణమైన ఆరుగురు పోలీసులపై హత్య కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితులంతా పరారీలో ఉన్నారు.
సంబంధిత పోలీసులపై హత్య కేసు నమోదు చేసిన ఒక రోజు తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రాధానత్య సంతరించుకున్నది. బాధిత వ్యాపారి కుటుంబానికి రూ 10 లక్షల పరిహారం కూడా ప్రభుత్వం ప్రకటించింది. సీఎం యోగి బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించనున్నారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు