 
                ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకాంక్షించారు. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్ శ్రింగ్లా తెలిపారు. ఆగస్టులో యుఎన్‌ఎస్‌సి అధ్యక్ష హోదాలో ఉన్న భారత్.. ఆఫ్గనిస్తాన్ సంక్షోభ సమయంలో సమర్థవంతంగా పనిచేసిందని బైడెన్ అభినందించారు. 
ఈ నేపథ్యంలో భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వతసభ్యత్వం ఉండాలని తాను భావిస్తున్నానని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీతో బైడెన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అనంతరం బైడెన్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం కాంక్షిస్తున్న భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. 
ఐక్యరాజ్య సమితి వ్యవస్థాపక దేశాల్లో భారత్ ఒకటి. ఏడుసార్లు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా వ్యవహరించింది. భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు ఉంటాయి. వీటిలో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా.. మరో 15 దేశాలను తాత్కాలిక సభ్యదేశాలుగా రెండేళ్ల కాలపరిమితితో ఎన్నుకుంటారు.
సంస్కరణలకు నిర్దిష్ట గడువు కోరిన జి4 దేశాలు
మరోవంక, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు తెచ్చేందుకు నిర్దిష్ట గడువు విధించాలని జి4 దేశాలు కోరాయి. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఆశిస్తున్న నాలుగు దేశాల బృందాన్నే జి4 గా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూపులో భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ ఉన్నాయి. 
న్యూయార్క్‌లో జర్మనీ, జపాన్, బ్రెజిల్ విదేశాంగ మంత్రులతో సమావేశానంతరం భారత్ విదేశాంగమంత్రి జైశంకర్ మాట్లాడుతూ, అతిపెద్ద జనాభా, పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్ భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి అన్ని విధాలా అర్హురాలని స్పష్టం చేశారు. 
అయిదు శాశ్విత సభ్య దేశాల్లో తమకు చోటు కల్పించకపోతే లాటిన్ అమెరికా దేశాలను విస్మరించినట్టేనని బ్రెజిల్ వాదిస్తున్నది. రెండవ ప్రపంచ యుద్ధంలో విజేతలైన వారికి మాత్రమే పి5 (భద్రతా మండలిలో అయిదు శాశ్వత సభ్య దేశాలు) స్థానం దక్కిందని జపాన్, జర్మనీలు భావిస్తున్నాయి. 
కాగా, ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై జరిగిన జి20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలోనూ జైశంకర్ పాల్గొంటూ ఆఫ్ఘన్‌కు సాయం అందించేవారికి ఎలాంటి ఆంక్షలు లేకుండా, నేరుగా వెళ్ళగలిగే అవకాశం కల్పించాలని కోరారు. ఆఫ్ఘన్ గడ్డను తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించరాదని తాలిబన్లు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ఆఫ్ఘన్ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేశారు.
                            
                        
	                    




More Stories
చాబహార్ పోర్ట్‌పై అమెరికా ఆంక్షల నుండి తాత్కాలిక ఊరట
అమెరికాలో వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు
ఆరేళ్ల తర్వాత ట్రంప్, జిన్‌పింగ్ భేటీ.. 10 శాతం టారిఫ్ తగ్గింపు