అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు అనునిత్యం అరాచకాలకు పాల్పడుతున్నారు. అఫ్ఘానిస్తాన్ లోని పంజ్ షీర్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. అయితే ఇంతలోనే పంజ్‌షీర్ తిరుగుబాటు దళం తాలిబన్ల ప్రకటనను తీవ్రంగా ఖండించింది.
తాలిబన్లతో యుద్ధం కొనసాగుతున్నదని… పంజ్‌షీర్ ఇంకా వారికి లొంగిపోలేదని తెలిపింది. పంజ్‌షీర్ తిరుగుబాటు దళం తాజాగా మరో ప్రకటన చేసింది. 600 మంది తాలిబన్ ఫైటర్లను పంజ్‌షీర్ యోధులు అంతమొందించారని ప్రకటించింది. అలాగే వెయ్యి పైగా తాలిబన్లు తమకు లొంగిపోయారని వెల్లడించింది.
ఈ ప్రకటన పంజ్‌షీర్ తిరుగుబాటు దళ ప్రతినిధి ఫహీం దష్టి నుంచి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా పంజ్‌షీర్‌పై ఆధిపత్యం సాధించామని తాలిబన్లు… వారు చేస్తున్న దాడులను తిప్పికొడుతున్నామని పంజ్‌షీర్ నేతలు చేస్తున్న ప్రకటనలతో గందరగోళం నెలకొంది. దీంతో వాస్తవ పరిస్థితి ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది.
మరోవంక, ఆఫ్ఘనిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి గుల్బుద్దీన్ హెక్మత్యార్, పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ ఫయీజ్ హమీద్ సమావేశమైనట్లు ఆఫ్ఘన్ మీడియా ఆదివారం తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై వీరు చర్చించినట్లు తెలిపింది. హిజ్బ్-ఈ-ఇస్లామీ నేత ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు పేర్కొంది.
మరోవైపు ఇరాన్, చైనా, తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్ దౌత్యవేత్తలతో పాకిస్థాన్ ఆన్లైన్ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపింది. ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్థాన్‌పై చర్చించినట్లు పేర్కొంది.
అంతర్యుద్ధం దిశగా ఆఫ్ఘన్
ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు చూస్తుంటే అంతర్యుద్ధానికి దారితీసే విధంగా ఉన్నాయని అమెరికా జనరల్ మీడియాకు తెలిపారు. దేశంలో ఉగ్రవాద మూకలు మళ్లీ చెలరేగేలా ఉన్నాయని హెచ్చరించారు. సైనిక అంచనా ప్రకారం.. అంతర్యుద్ధం ఏర్పడే అవకాశం ఉందని జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ మార్క్ మిల్లే తెలిపారు.
అక్కడి పరిస్థితులు చూస్తుంటే అల్ – ఖైదా, ఐసిస్ లేదా ఇతర ఉగ్రవాద సంస్థల పెరుగుదలకు దారితీయవచ్చని చెప్పారు. తాలిబన్లు ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని.. అధికారాన్ని ఏకీకృతం చేసి సమర్థవంతమైన పాలనను వారు అందించగలరా అని ప్రశ్నించారు. ఆఫ్ఘన్లో రోజువారీ పరిస్థితులు భయానకంగా మారుతున్నాయని.. అక్కడ ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. రానున్న మూడేళ్లలో ఉగ్రవాదం మళ్లీ విస్తరించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

More Stories
పాక్ అధికారులపై ఆంక్షలు.. అమెరికా కాంగ్రెస్ సభ్యుల వినతి
పాకిస్థాన్ తొలి సిడిఎఫ్ గా అసిమ్ మునీర్
రూ.500తో మహిళలకు 40 నిమిషాల ఆన్లైన్ ఉగ్రవాద శిక్షణ