
శనివారం కన్నుమూసిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్‌సింగ్ భౌతికకాయానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నో వచ్చిన మోదీ నేరుగా కళ్యాణ్ సింగ్ నివాసానికి వెళ్లారు. కల్యాణ్ సింగ్ నివాసం వెలుపల మోదీ విలేకర్లతో మాట్లాడుతూ, సమర్థుడైన నాయకుడిని తాము కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటును భర్తీ చేయాలంటే, ఆయన విలువలు, నిర్ణయాలను అమలు చేయడానికి గరిష్ఠ స్థాయిలో కృషి చేయాలని సూచించారు.
ఆయన కలలను నిజం చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఆయనకు తన వద్ద స్థానం కల్పించాలని, ఈ బాధను తట్టుకోగలిగే శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కళ్యాణ్‌సింగ్ జన సంక్షేమాన్నే తన జీవిత మంత్రంగా చేసుకున్నారు. ఆయన యూపీతోపాటు దేశ అభివృద్ధికి పాటుపడ్డారు. నిజాయితీ, మంచి పాలనతో పేరు సంపాదించారు అని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆదివారం ఇచ్చిన ట్వీట్లో, కల్యాణ్ సింగ్ ప్రజా శ్రేయస్సునే తన జీవిత మంత్రంగా చేసుకున్నారని తెలిపింది. దేశం, ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారని పేర్కొంది. నిజాయితీపరుడు, సుపరిపాలకుడు అనే పదాలకు పర్యాయపదంగా మారారని తెలిపింది. అంతకుముందు లక్నో చేరుకున్న ప్రధానికి మోదీకి.. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతం పలికారు.
కల్యాణ్ సింగ్ పార్దివ దేహాన్ని ప్రజల సందర్శన కోసం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు విధాన సభ ప్రాంగణంలో ఉంచారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల వరకు బీజేపీ కార్యాలయంలో ఉంచారు. అనంతరం అలీగఢ్‌లోని స్టేడియంలో ఉంచారు. అక్కడి నుంచి నరోరాలోని గంగా నది ఒడ్డుకు తరలించి సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
More Stories
లింగ నిష్పత్తులు పడిపోవటంపై ఆందోళన
బీహార్ లో జేడీయూ- బీజేపీ చెరో 101 సీట్లు
విజయ్ ను ఎన్డీయేలో చేరమని పవన్ కళ్యాణ్ హితవు!