
ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశమైపోయినదనగానే ఎందరో ప్రముఖులు భయంతో దేశం వదిలి పరుగులు పెడుతుండగా, కొద్దిమంది మహిళలు మాత్రం ధైర్యంతో తమ హక్కులను కాలరాస్తే సహించెడిది లేదంటూ నిరసనగళం వినిపిస్తున్నారు. తాలిబన్ సాయుధ యువకులు తుపాకులను ఎక్కుపెట్టి, ఇప్పుడే స్వాధీనం చేస్తుకున్న నగరాలలో తిరుగుతున్నా, దేశ రాజధానిలోనే కొందరు మహిళలు నిరసనకు దిగడం గమనార్హం.
తాలిబాన్ స్వాధీనం తర్వాత కాబూల్‌లో మహిళల నిరసన ఇదే మొదటిసారి. మహిళలు చేతితో రాసిన కాగితపు ప్లేకార్డులలో “మాకు మా హక్కులు కావాలి, ఇక్కడ మహిళలు ఉన్నారు, మాకు సామాజిక భద్రత కావాలి, పనిపై నిషేధం లేదు, విద్యాహక్కు, రాజకీయ భాగస్వామ్యపు హక్కు కావాలి. ఏ శక్తి స్త్రీలను విస్మరించలేదు. అణచివేయదు. సంవత్సరాలుగా ప్రాధమిక హక్కులపై మేము సాధించిన విజయాలపై రాజీ ప్రసక్తిలేదు! ” అంటూ సింహానినాదం చేశారు.
తాలిబాన్లు చారిత్రాత్మకంగా తక్కువ మనుషులుగా భావించే మహిళల నేతృత్వంలోని ఒక నిరసన ఆఫ్ఘనిస్తాన్ నుండి ఒక బలమైన సందేశంగా వచ్చింది. తాలిబాన్ పాలనలో ఏమి జరుగుతుందో అనే భయంతో వేలాది మంది ఆఫ్ఘనిస్తాన్ దేశం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన మొట్టమొదటి ప్రజా నిరసనలో ఈ మహిళలు తమ హక్కులను కోరుతున్నారు.
తుపాకులతో ముష్కరమూకలు చుట్టూ చేరినప్పటికీ, ఏ మాత్రం భయపడకుండా హక్కుల కోసం అఫ్గాన్ మహిళలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తాలిబాన్ నాయకులు బాలికలు, మహిళలు ‘నియమాలు’ పాటించినంత వరకు చదువుకోవచ్చు, పని చేయగలరని హామీ ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. తాలిబాన్లు కాబూల్‌కి చేరుకున్న రోజున మహిళల కోసం ఒక బ్యూటీ షాప్ పోస్టర్లను తీసివేసి ,దాని ముందు భాగంలో పెయింటింగ్ చేసిన చిత్రాలు వైరల్ అయ్యాయి. చాలా మంది మహిళలు ఇప్పుడు తాలిబాన్ పాలనలో తమ భవిష్యత్తు గురించి భయపడుతున్నారు.
మంగళవారం, తాలిబాన్ నిర్వహించిన మొదటి విలేకరుల సమావేశంలో వారిప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు పని చేయడానికి, చదువుకోవడానికి, “సమాజంలో చాలా చురుకుగా ఉండటానికి ఇస్లాం చట్రంలో” అనుమతించబడతారు” అంటూ భరోసా ఇచ్చారు.
అయితే, రాయిటర్స్ ప్రకారం, ఇటీవలి రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగిన తాలిబాన్ గందరగోళంలో కొంతమంది మహిళలను తమ ఉద్యోగాల నుండి వైదొలగమనిఇప్పటికే ఆదేశించారు. మరికొందరు మిలిటెంట్లు ఏది చెప్పినా వాస్తవం భిన్నంగా ఉండవచ్చునని భయపడుతున్నారు.
మహిళా జర్నలిస్టులు ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నారు. మహిళా న్యూస్ యాంకర్లను పురుషులతో భర్తీ చేస్తున్నట్లు కధనాలు వచ్చాయి. అయితే ఈ వార్తల అనంతరం తిరిగి మహిళా యాంకర్లను తెరపైకి తెచ్చారు.
కాలం మారింది అని చెప్పేవారు కొందరు, ప్రస్తుత తరం ఆఫ్ఘన్ మహిళలు విద్యావంతులు, అవగాహన కలిగిన వారు కావడంతో గతంలో వలే అణిగివుండే అవకాశం లేదని భావిస్తున్నారు. కమ్యూనికేషన్, ముఖ్యంగా సోషల్ మీడియా, ఏదైనా చర్యలను నిమిషాల్లో ప్రపంచానికి తెలిసేటట్లు చేయడమే వారికి ప్రధాన ఆయుధం కానున్నది.
ఆఫ్ఘనిస్తాన్‌లో నివసించడానికి తిరిగి వచ్చిన విద్యావేత్త, మహిళా హక్కుల కార్యకర్త బరాక్ జల్మాయ్ ఖాన్ దురానీ, “ప్రస్తుతం, మేము తిరిగి పోరాడతాము” అని స్పష్టం చేశారు. పాకిస్తాన్లో ఒకప్పుడు శరణార్థిగా ఉన్న దురానీ తనకు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండే హక్కు ఉందని చెప్పింది. తాలిబాన్ స్వాధీనం తర్వాత పారిపోవాలని భావించిన ఒక ప్రశ్నకు సమాధానంగా, దురానీ జర్నలిస్ట్ హాలా గోరానీతో మాట్లాడుతూ, విద్యావంతురాలైన మహిళగా ఆఫ్ఘన్ బాలికలు విద్యను పొందేలా భవిష్యత్తు తరాలకు తాను రుణపడి ఉంటానని చెప్పింది.
“ఇది తక్కువ వీరోచితమైనది. మనం ఇప్పుడే మాట్లాడకపోతే తరువాతి తరం విద్యావంతులు కాలేరు” అంటూ ఆమె హెచ్చరించారు. 90 వ దశకంలో భూగర్భ పాఠశాలలను నడుపుతున్న వీరోచిత మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. 2020 లో, ఆమె మలాలా ఫండ్ ఎడ్యుకేషన్ ఛాంపియన్ అవార్డును అందుకున్న మొట్టమొదటి మహిళగా ఆఫ్ఘనిస్తాన్‌లో కాందహార్ నుండి ఎంపికైంది.
ఆదివారం కాబూల్ నుండి ఢిల్లీకి వచ్చిన ఒక ఆఫ్ఘన్ మహిళ మీడియాతో మాట్లాడుతూ, తన స్నేహితులు ఇంటికి తిరిగి వచ్చేందుకు భయపడుతున్నారని చెప్పింది. “వారు [తాలిబాన్] మమ్మల్ని చంపబోతున్నారు. మా మహిళలకు ఇకపై ఎలాంటి హక్కులు ఉండవు ” అని ఇండియా టుడే తో ఆవేదన వ్యక్తం చేసింది.
మీడియా నివేదికలు, సోషల్ మీడియా పోస్ట్‌లు కూడా చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ మహిళలు తమను తాలిబాన్ పోరాటయోధులు బలవంతంగా “వివాహం చేసుకుంటారని” భయపడుతున్నారని సూచించింది. ఇతర చిత్రాలు తాలిబాన్లు ఎల్లప్పుడూ అమలు చేసే పూర్తి ఆఫ్ఘన్ బుర్ఖా, చాదరిని ధరించినట్లు చూపించాయి. ఇరాన్ జర్నలిస్ట్, కార్యకర్త మసిహ్ అలినెజాద్ “తప్పనిసరి హిజాబ్ తాలిబాన్ల సంస్కృతి” అని పేర్కొన్నారు.
“తాలిబాన్ల అబద్ధాలను నమ్మవద్దు. నా వయసు 23. నాలాంటి మహిళలను తాలిబాన్లు తమ పోరాట యోధులకు బలవంతంగా వివాహం చేశారు. తాలిబాన్ ప్రతినిధికి ట్విట్టర్లో ఖాతా ఉంది. దేనికోసం? ప్రపంచంలో వారి అబద్ధాలను వ్యాప్తి చేసినందుకు” అంటూ ఇటీవల వైరల్ అయినా వీడియోలో ఒక ఆఫ్ఘన్ మహిళ చెప్పింది.
“మన గురించి ఎవరూ పట్టించుకోరు. మనం చరిత్రలో నెమ్మదిగా చనిపోతాము, ”అని ఆమె మంగళవారం ఇరానియన్ జర్నలిస్ట్ మసీహ్ అలినెజాద్తో చేసిన చాట్‌లో చెప్పారు. ఆమె, “తాలిబాన్లు నాలాంటి మహిళలను చూసినట్లయితే, వారు నన్ను తమ పోరాట యోధులలో ఒకరిని బలవంతంగా వివాహం చేసుకుంటారు, మరో మాటలో చెప్పాలంటే ఇస్లామిక్ అత్యాచార వివాహం … వారు మమ్మల్ని, మహిళలను యుద్ధ వరాలుగా భావిస్తారు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
కాబుల్‌లో చిక్కుకుపోయి, భారత్ కు తిరిగి వచ్చిన భారతీయ జర్నలిస్టు కనికా గుప్తా తాను అక్కడి దుర్భర పరిస్థితులను ప్రత్యక్షంగా చూశానని, వాటిని చెప్పేటప్పుడు కూడా వణుకు వస్తుందని పేర్కొన్నారు. వారు అఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నాక శాంతియుత వాతావరణం నెలకొల్పుతామని చెప్పారని, అయితే వారు తమను ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతివ్వలేదని, అటువంటి పరిస్థితిలోనే తాను రిపోర్టింగ్ చేశానని కనికా తెలిపారు.
తన ఇంటి కిటికీ నుంచి బయటకు చూడగా, ఉద్రిక్త వాతావరణం కనిపించిందని ఆమె చెప్పారు. గడచిన రెండు నెలల్లో అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. అక్కడ సెలూన్లను మూసివేశారని, బుర్కాలకు మరింత డిమాండ్ పెరిందని వివరించారు.
కాగా, దేశ పార్లమెంట్ భవనంపై తాలిబన్ జెండాను ఎగురవేయడాన్ని నిరసిస్తూ జలాలాబాద్‌లో కొందరు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాలిబన్ జెండాలను తొలగించి అఫ్గాన్ ప్రభుత్వ జెండాలను ఎగురవేశారు. మరోవైపు అఫ్గాన్ తొలి మహిళా మేయర్ జరీఫా గఫారీని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన